ఐటీ శాఖ నుంచి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!
22 February 2022, 15:52 IST
- మీకు ఆదాయపు పన్నుశాఖలో ఉద్యోగం వచ్చిందని అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందా? మీ నుంచి ఎవరైనా డబ్బులు లేదా వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇదే విషయంపై ఐటీశాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది.
ఐటీశాఖ
government jobs fake website | సామాజిక మాధ్యమాలను దుర్వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ఫేక్ న్యూస్ అనేది ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా.. ఇందుకు సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కొందరికి అపాయింట్మెంట్ లెటర్లు అందుతున్నాయి. వాటిని నిజమని నమ్మి వారు మోసపోతున్నారు. ఇలా ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేసిన వారు, డేటా, డబ్బులు తీసుకుని పారిపోతున్నారు. ఇలా చాలా మంది ఇప్పటికే మోసపోయారు.
ఆదాయపు పన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో ఈ మధ్యకాలంలో ఫేక్ అపాయింట్మెంట్లు పెరిగిపోయాయి. తాజాగా.. దీనిపై ఐటీశాఖ స్పందించింది. ఇలాంటి వాటికి లోంగిపోయి, మోసపోకండని హెచ్చరించింది.
"ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేసి ఐటీశాఖలో ఉద్యోగాలంటూ అభ్యర్థులను కొందరు మోసం చేస్తున్నారు. ఈ విషయం ఐటీశాఖ దృష్టికి వచ్చింది. గ్రూప్ బీ/ గ్రూప్ సీ పోస్టుల భర్తీకి.. ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. అందుకు సంబంధించిన వివరాలు https://ssc.nic.in లో పొందవచ్చు. ఆ తర్వాత ప్రాంతీయంగా భర్తీలు చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేసి, వాటిని https:/ / incometaxindia.gov.in వెబ్సైట్లో పెడతారు. ఇది ప్రజలు గమనించాలి. ఫేక్ యాడ్లు, నోటిఫికేషన్లు, అపాయింట్మెంట్ లెటర్లును నమ్మకండి. ఎస్ఎస్సీ, ఐటీశాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లోనే వివరాలు తెలుసుకోండి," అని ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది ఐటీశాఖ.