IndiGo three Doors: 3 ఎగ్జిట్ డోర్ల ద్వారా ప్రయాణికులు దిగే సౌలభ్యం
04 August 2022, 13:29 IST
- IndiGo three Doors: ఇండిగో ప్రయాణికులు విమానం నుంచి ఇక వెంటవెంటనే దిగే సౌలభ్యం ఏర్పడనుంది.
Indigo: ఇకపై మూడు ఎగ్జిట్ మార్గాల ద్వారా ప్రయాణికులు దిగవచ్చు
న్యూఢిల్లీ, ఆగస్ట్ 4: ఇకపై విమానంలోని మూడు డోర్ల నుండి ప్రయాణికులను దించుతామని ఇండిగో ప్రకటించింది. తద్వారా ప్రయాణికులు త్వరగా విమానం నుండి దిగవచ్చని తెలిపింది.
‘కొత్తగా మూడు పాయింట్ల నుంచి దిగే అవకాశం ఉంటుంది. ముందు వైపు రెండు చోట్ల, వెనక భాగంలో ఒక చోట ఎగ్జిట్ ర్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రక్రియను ఉపయోగించిన ప్రపంచంలోని మొదటి ఎయిర్‌లైన్‌గా ఇండిగో నిలిచింది..’ అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా ఢిల్లీ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ మూడు పాయింట్ల నుంచి దిగడం వల్ల విమానయాన సంస్థకు ఐదు-ఆరు నిమిషాలు ఆదా అవుతుందని, తద్వారా విమానాలు వేగంగా తిరగడానికి సాధ్యమవుతుందని చెప్పారు.
‘రెండు పాయింట్లు ఉన్న ఏ321 విమానం దిగడానికి సాధారణంగా 13-14 నిమిషాలు పడుతుంది. మూడు పాయింట్ల నుంచి దిగితే, ప్రయాణీకులందరూ విమానం నుండి దిగడానికి కేవలం ఏడు-ఎనిమిది నిమిషాలు పడుతుంది’ అని ఆయన తెలిపారు.
ఇండిగో ప్రాథమికంగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో మూడు పాయింట్ల ఎగ్జిట్‌ను అమలు చేస్తుందని సీఈవో చెప్పారు. క్రమంగా ఎయిర్‌లైన్ దీన్ని అన్ని నగరాలకు విస్తరిస్తుందని దత్తా తెలిపారు. ఇండిగో తన 16వ వార్షికోత్సవాన్ని గురువారం జరుపుకుంది.