తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India’s Urban Population: 2035 నాటికి 67.5 కోట్లకు పట్టణ జనాభా..

India’s urban population: 2035 నాటికి 67.5 కోట్లకు పట్టణ జనాభా..

30 June 2022, 12:03 IST

google News
    • India Urban population: పట్టణీకరణ నెమ్మదించడం తాత్కాలికమేనని యూఎన్ నివేదిక స్పష్టం చేసింది.
జెనీవాలోని ఐరాస కార్యాలయం ముందు ఎగురుతున్న యూఎన్ జెండా
జెనీవాలోని ఐరాస కార్యాలయం ముందు ఎగురుతున్న యూఎన్ జెండా (REUTERS)

జెనీవాలోని ఐరాస కార్యాలయం ముందు ఎగురుతున్న యూఎన్ జెండా

ఐక్యరాజ్యసమితి, జూన్ 30: ఇండియా పట్టణ జనాభా 2035 నాటికి 67.5 కోట్లకు చేరుతుందని యూఎన్ హాబిటేట్స్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022 వెల్లడించింది. ఇదే కాలానికి చైనా పట్టణ జనాభా వంద కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. కోవిడ్-19 మహమ్మారి అనంతరం ప్రపంచ పట్టణ జనాభా తిరిగి ట్రాక్‌పైకి వచ్చిందని, 2050 నాటికి 2.2 బిలియన్ల మేర పెరుగుతుందని వెల్లడించింది.

వేగవంతమైన పట్టణీకరణ కోవిడ్-19 వల్ల తాత్కాలికంగా నెమ్మదించిందని బుధవారం విడుదలైన ఈ యునైటెడ్ నేషన్స్ హాబిటాట్స్ ప్రపంచ నగరాల నివేదిక-2022 వెల్లడించింది.

ఇండియా పట్టణ జనాభా 2035 నాటికి 67 కోట్ల 54 లక్షల 56 వేలుగా ఉంటుందని, 2020లో ఇది 48 కోట్ల 30 లక్షల 99 వేలుగా ఉందని తెలిపింది. 2025 నాటికి 54.27 కోట్లకు చేరుతుందని, 2030 నాటికి 60.07 కోట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.

చైనాలో పట్టణ జనాభా 2035 నాటికి 1.05 బిలియన్లుగా ఉంటుందని, ఏషియాలో పట్టణ జనాభా 2.99 బిలియన్లుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. దక్షిణ ఏషియాలో 2035 నాటికి పట్టణ జనాభా 98.75 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.

చైనా, ఇండియా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల వాటా ప్రపంచ జనాభాలో ఎక్కువగా ఉందని, వాటి అభివృద్ధి పథం ప్రపంచ అసమానతలను బాగా ప్రభావితం చేశాయని నివేదిక విశ్లేషించింది.

‘ఏషియాలో గడిచిన రెండు దశాబ్దాల్లో చైనా, ఇండియా వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, పట్టణీకరణను చవిచూశాయి. ఇది పేదరికంలో నివసిస్తున్న జనాభా శాతాన్ని బాగా తగ్గించింది..’ అని నివేదిక చెప్పింది.

పెరుగుతున్న జనన రేటు కారణంగా, ముఖ్యంగా తక్కువ ఆదాయం గల దేశాల్లో ప్రస్తుత పట్ణణ జనాభా పెరుగుతూనే ఉంటుందని నివేదిక తెలిపింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా 56 శాతం ఉండగా, 2050 నాటికి ఇది 68 శాతానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది.

కోవిడ్-19 తొలినాళ్లలో రక్షణ కోసం గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు వలస వెళ్లారని, అయితే అది స్వల్పకాలిక స్పందన మాత్రమేనని, ప్రపంచ పట్టణీకరణ గమనాన్ని మార్చలేదని నివేదించింది.

పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, కోవిడ్ వల్ల ఆర్థిక కష్టాలు ఎదురైనప్పటికీ, నగరాలు మరోసారి నిరుద్యోగులకు, విద్యార్థులకు, శిక్షణార్థులకు సంక్షోభంలో రక్షణగా నిలిచాయని నివేదిక తెలిపింది.

పట్టణీకరణలో అసమానతలు ఉన్నప్పటికీ మానవతా భవిష్యత్తు పట్టణాలదేనని నివేదిక తెలిపింది.

పట్టణీకరణ 21వ శతాబ్దపు మెగా ట్రెండ్‌గా మిగిలిపోయిందని యూఎన్ అండర్ సెక్రటరీ జనరల్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యూఎన్ హాబిటాట్ మైమునా మహ్మద్ షరీఫ్ అన్నారు.

‘పట్టణీకరణ అనేక సవాళ్లను తెలియపరుస్తుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆ సవాళ్లు మరింతగా వెలుగులోకి వచ్చాయి. అయితే పట్టణీకరణ సవాళ్లను వినూత్నంగా ఎదుర్కునేలా కోవిడ్-19 అవకాశం కల్పించింది. ప్రభుత్వాల సరైన విధానాలతో మన పిల్లలు మరింత సమగ్రమైన, పచ్చదనంతో, భద్రతతో, ఆరోగ్యంతో కూడిన పట్టణ భవిష్యత్తును వారసత్వంగా పొందవచ్చు..’ అని అన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం