Indian girl buried alive: భారతీయ యువతి దారుణ హత్య; ప్రాణాలతో ఉండగానే పూడ్చిపెట్టిన దుర్మార్గుడు
06 July 2023, 18:56 IST
Indian girl buried alive: భారతీయ యువతి జాస్మిన్ కౌర్ దారుణ హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు తారిక్ జోత్ సింగ్ ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
హత్యకు గురైన జాస్మిన్ కౌర్ (ఫైల్ ఫొటో)
Indian girl buried alive: భారతీయ యువతి జాస్మిన్ కౌర్ దారుణ హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు తారిక్ జోత్ సింగ్ ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన 2021 మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగింది. కోర్టు విచారణలో తన నేరాన్ని తారిక్ జోత్ సింగ్ అంగీకరించాడు. మొదట తాను ఆ హత్య చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకున్నదని వాదించిన తారిక్ జోత్ సింగ్.. ఆ తరువాత తన నేరాన్ని అంగీకరించి, హత్య చేసిన తీరును వివరించాడు.
తాళ్లతో కట్టేసి..
కోర్టుకు తారిక్ జోత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతీయ సంతతికి చెందిన 21 ఏళ్ల జాస్మిన్ కౌర్ ఆస్ట్రేలియాలో నర్సింగ్ విద్య అభ్యసిస్తోంది. స్థానికంగా ఉండే తారిక్ జోత్ సింగ్ తో అప్పటివరకు ఉన్న అనుబంధాన్ని విబేధాల కారణంగా ఆమె విడనాడింది. అయితే, తనను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేకపోయిన తారిక్.. ఆమెపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను కిడ్నాప్ చేశాడు. జాస్మిన్ కౌర్ జాబ్ చేస్తున్న చోటు నుంచి కిడ్నాప్ చేసి, చేతులు, కాళ్లు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి, కారులో దాదాపు 650 కిమీలు తీసుకువెళ్లాడు. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ రేంజ్ కు తీసుకువెళ్లి, అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆమెను సజీవంగా పూడ్చిపెట్టాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు.
పోలీసు కేసు..
కూతురు కనిపించకపోవడంతో జాస్మిన్ కౌర్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తారిక్ జోత్ సింగ్ తన కూతురిని చాన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అతడి ప్రేమను నిరాకరించినప్పటికీ.. ఆమె వెంట పడుతున్నాడని, కూతురి అదృశ్యం వెనుక తారిక్ హస్తం ఉండొచ్చని ఆమె తన అనుమానం వ్యక్తం చేసింది. దాంతో, పోలీసులు తారిక్ ను విచారించారు. చివరకు నేరాన్ని అంగీకరించిన తారిక్ జోత్ సింగ్.. జాస్మిన్ ను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ నేరానికి గానూ తారిక్ జోత్ సింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.