Guinness World Record: ఇలా కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టొచ్చు..
21 November 2023, 20:01 IST
Guinness World Record: ఈ యువతి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఆ రికార్డు సాధించిన తరువాత ఆమె అది తన లైఫ్ టైం అచీవ్ మెంట్ అని వ్యాఖ్యానించారు.
అత్యధిక పళ్లు ఉన్న మహిళగా రికార్డు సృష్టించిన కల్పన
Highest number of teeth: 26 ఏళ్ల భారతీయ యువతి కల్పన బాలన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. నోటిలో అత్యధిక సంఖ్యలో పళ్లు (teeth) ఉండడంతో ఆమె కు ఈ రికార్డు దక్కింది. కల్పన నోటిలో మొత్తం 38 పళ్లు ఉన్నాయి.
గిన్నిస్ రికార్డు
సాధారణంగా వయోజనుల నోటిలో 32 పళ్లు ఉంటాయి. కానీ, కల్పన బాలన్ నోటిలో 38 పళ్లు ఉన్నాయి. అదే ఆమెకు గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించి పెట్టింది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పళ్లు () ఉన్న మహిళగా ఆమె ఈ రికార్డు సాధించారు. కల్పనకు నోటిలోపల పైభాగంలో నాలుగు పళ్లు, కింది భాగంలో 2 పళ్లు అదనంగా వచ్చాయి. పురుషుల్లో ఈ రికార్డు కెనడాకు చెందిన ఇవానో మెలోన్ పేరుపై ఉంది. ఆయనకు మొత్తం 41 పళ్లు ఉన్నాయి.
డాక్టర్ దగ్గరకు వెళ్తే..
తన పళ్ల రికార్డుపై కల్పన స్పందించారు. ఇది తనకు చాలా సంతోషదాయక విషయమని, తనకు ఈ ఘనత లైఫ్ టైం అచీవ్మెంట్ లా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కల్పనకు కూడా మొదట్లో 32 పళ్లే ఉన్నాయి. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం ఒకటొకటిగా మరికొన్ని పళ్లు రాసాగాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అవి చాలా గట్టిగా ఉన్నాయని, కొంతకాలం తరువాత వాటిని తీసివేద్దామని చెప్పాడు. అయితే, కొత్తగా వచ్చిన పళ్లతో పెద్దగా ఏ సమస్య లేకపోవడంతో ఆమె వాటిని తొలగించుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారు. అనూహ్యంగా అవే ఆమెకు గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించి పెట్టాయి. ఇప్పుడు ఆమెకు కొత్తగా మరో రెండు పళ్లు కూడా వస్తున్నాయట. అంటే, తన రికార్డును తనే బద్ధలు కొట్టబోతోందన్నమాట.
మెడికల్ టర్మ్
ఇలా ఎక్కువ పళ్లు రావడాన్ని వైద్య పరిభాషలో హైపర్ డాంటియా, లేదా పాలి డాంటియా అంటారు. సాధారణంగా, ప్రపంచంలో 3.8% జనాభాకు 32 కన్నా ఒకటి కన్నా ఎక్కువ పళ్లు అదనంగా వస్తాయి. పళ్ల నిర్మాణంలో లోపాల కారణంగా ఈ సమస్య వస్తుంది.