India - Canada row: కెనడాలో వీసా సేవలు నిలిపేసిన భారత్; కారణం అదేనా..?
21 September 2023, 14:06 IST
India - Canada row: కెనడాలో వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ హత్యతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కెనడాలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత్ ఇప్పటికే అక్కడి భారతీయులకు సూచనలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రతీకాత్మక చిత్రం
India - Canada row: కెనడా వాసులు భారత్ రావడానికి అవకాశం కల్పించే వీసా సేవలను గురువారం నుంచి నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. నిర్వహణ అంశాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
గురువారం నుంచి..
కెనడా వాసులు భారత్ వీసా పొందడానికి సంబంధించి కెనడాలో ఇంటర్నల్ సెక్యూరిటీ సేవలను అందించే బీఎల్ఎస్ సంస్థ తన వెబ్ సైట్ లో ఈ వివరాలను పొందుపర్చింది. ‘నిర్వహణ కారణాల వల్ల 21 సెప్టెంబర్ నుంచి భారతీయ వీసా సేవలు నిలిపివేయబడ్తున్నాయి. రెగ్యులర్ అప్ డేట్స్ కోసం తరుచుగా ఈ వెబ్ సైట్ ను చూడండి’ అని ఆ వెబ్ సైట్ లో నోట్ ను పెట్టారు. మళ్లీ ఎప్పుడు ఈ వీసా సేవలను పునరుద్ధరిస్తారన్న విషయాన్ని నోట్ లో తెలపలేదు.
నిజ్జర్ హత్య..
ఖలిస్తాన్ నేత, భారత్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని సర్రే లో జూన్ 18న ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురయ్యారు. ఇద్దరు దుండగులు అతడిపై అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో నిజ్జర్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, భారత్ కు సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీలే ఈ హత్య చేశాయని, దీనిపై దర్యాప్తు జరపనున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత రాయబారిని కెనడా, భారత్ లోని కెనడా రాయబారిని భారత్ తమ దేశాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాయి.
భారత్ సూచనలు..
కెనడాలో ఉంటున్న భారతీయులకు భారత ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. కెనడాలోని వివిధ ప్రాంతాలకు అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది. ఈ పరిస్థితుల్లో కెనడా ఇమిగ్రేషన్ కోసం ప్రయత్నిస్తున్ భారతీయుల్లో ఆందోళన నెలకొన్నది.