India heatwave 2023 : మార్చ్‌లో అకాల వర్షాలు.. జూన్ వరకు భానుడి భగభగలు!
02 April 2023, 6:52 IST
India heatwave 2023 : దేశంలో మార్చ్ నెలలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జూన్ వరకు హీట్ వేవ్స్ ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి!
మార్చ్‌లో అకాల వర్షాలు.. జూన్ వరకు భానుడి భగభగలు!
India heatwave 2023 : దేశంలో భానుడి భగభగలతో భయపడిపోతున్న ప్రజలకు మరో చేదు వార్త! ఈ వేసవిలో జూన్ వరకు.. సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హీట్ వేవ్స్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరగనుంది.
నిన్న వర్షాలు.. నేడు హీట్ వేవ్..!
Temperature rise in India : దేశంలోని కేంద్ర, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో.. రానున్న మూడు నెలల పాటు ప్రజలను హీట్ వేవ్స్ ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయని.. ఐఎండీ (భారత వాతావరణశాఖ) డైరక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహాపాత్ర తెలిపారు. దేశంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటానికి అంతర్జాతీయంగా వాతావరణ మార్పులు కారణ అని వివరించారు.
సాధారణంగా మార్చ్ నెలలో వర్షాలు పడవు. కానీ ఈసారి.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. సాధారణం కన్నా ఇది 26శాతం ఎక్కువ. ఫలితంగా చేతికి అందాల్సిన గోధుమ, ఉల్లితో పాటు ఇతర పంటలు నాశనమైపోయాయి. ఈ పరిణామాలతో సప్లై చెయిన్ వ్యవస్థ దెబ్బతిని, ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక రానున్న హీట్ వేవ్స్‌తో పంట సరిగ్గా పండుతుందా? లేదా? అన్న భయాలు రైతుల్లో నెలకొంది.
India Heatwave latest news : దేశంలోని అనేక ప్రాంతాల్లో.. మార్చ్ నెల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ నమోదయ్యాయి. అకాల వర్షాలే ఇందుకు కారణం.కాగా.. కేంద్ర, దక్షిణ, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది.
ఇక ఏప్రిల్‌లో.. బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌లలో హీట్ వేవ్స్ ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
కేంద్రం సన్నద్ధం..
Heat wave in April in India : భారీ ఉష్ణోగ్రతల అంచనాల నేపథ్యంలో కేంద్రం సన్నద్ధమవుతోంది. ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుందని సంబంధిత మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. బొగ్గును దిగుమతి చేసుకుని విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని పవర్ ప్లాంట్లకు ఆదేశాలిచ్చింది.