తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Population: చైనాను మించి ఇండియాలోనే అత్యధిక జనాభా: ఐక్యరాజ్య సమితి డేటా: ఏ ఏజ్ గ్రూప్ వారు ఎంత శాతం?

Population: చైనాను మించి ఇండియాలోనే అత్యధిక జనాభా: ఐక్యరాజ్య సమితి డేటా: ఏ ఏజ్ గ్రూప్ వారు ఎంత శాతం?

19 April 2023, 11:02 IST

google News
    • India Population: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. చైనా అధిగమించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

India Population: జనాభా విషయంలో చైనా(China)ను భారత దేశం అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ (United Nations Population Fund - UNFPA) తాజా డేటా స్పష్టం చేసింది. చైనా కంటే ఇండియాలో 29లక్షల మంది జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపింది. చైనాను భారత్ ఎప్పుడు దాటిందో స్పష్టంగా వెల్లడించకపోయినా.. ప్రస్తుతం ఇండియాలోనే జనాభా ఎక్కువగా ఉందని ఆ డేటా ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో 142.86 కోట్ల జనాభా ఉంది. చైనా జనాభా 142.57 కోట్లుగా ఉందని ఆ డేటా వెల్లడించింది. భారత్‍లో ఏ వయసు వారు ఎంత శాతం ఉన్నారో కూడా ఈ డేటా పేర్కొంది. వివరాలివే.

India Population: “8 బిలియన్ జీవితాలు, అనంతమైన అవకాశాలు” పేరుతో “ది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్, 2023”ను UNFPA ప్రచురించింది. జనాభా విషయంలో చైనాను ఇండియా దాటిపోయిందని ఈ డేటా అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా 800కోట్లకు సమీపించిందని పేర్కొంది. చైనా కంటే భారత జనాభా 2.9 మిలియన్లు ఎక్కువగా ఉందని పేర్కొంది. చైనా జానాభాను భారత్ దాటడం 1950 తర్వాత ఇదే తొలిసారి. 1950 నుంచే ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటాను వెల్లడిస్తోంది. “అవును, ఇరు దేశాల్లో వ్యక్తిగత డేటా సేకరణ టైమింగ్స్ భిన్నంగా ఉన్న కారణంగా చైనాను ఇండియా ఎప్పుడు దాటిందో కచ్చితంగా స్పష్టం చేయలేకున్నాం” అని యూఎన్‍ఎఫ్‍పీఏ మీడియా, క్రైసిస్ కమ్యూనికేషన్స్ అడ్వయిజ్ అన్నా జెఫెరీస్ తెలిపారు.

India Population: చైనా జనాభా గతేడాది పీక్‍కు చేరిందని, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని, ఇండియా జనాభా మాత్రం పెరుగుతోందని జెఫెరీస్ చెప్పారు.

ఏజ్ గ్రూప్ శాతాలు ఇలా..

India Population: ఇండియా జనాభాలో ఏజ్ గ్రూప్‍ల శాతాన్ని UNFPA డేటా వెల్లడించింది. భారత జనాభాలో 0 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 25 శాతం, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 18 శాతం, 10 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు 26 శాతం ఉన్నారని ఆ డేటా వెల్లడించింది. ఇండియాలో 15 నుంచి 64 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని, 65 సంవత్సరాలకు పైబడిన వారు జనాభాలో 7 శాతంగా ఉన్నారని తెలిపింది.

చైనా జనాభాలో 65 ఏళ్లు దాటిన వారు 20 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ పేర్కొంది.

చైనాలో ఎక్కువ జీవితకాలం

India Population: ఆయుర్దాయం (జీవితకాలం) విషయంలో ఇండియా కంటే చైనా మెరుగ్గా ఉందని ఈ యూఎన్‍ఎఫ్‍పీఏ డేటా స్పష్టం చేసింది. చైనాలో మహిళల సగటు ఆయుర్దాయం 82 సంవత్సరాలుగా, పురుషుల ఆయుర్దాయం 76 ఏళ్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఇండియాలో పరుషుల సగటు జీవితకాలం 74 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం సగటున 71 ఏళ్లు ఉన్నట్టు వెల్లడించింది.

అభివృద్ధికి భారత్‍కు ఎక్కువ అవకాశం

India Population: యువ జనాభా ఎక్కువగా ఉండడం భారత్‍కు చాలా సానుకూల అంశం అని, దేశాభివృద్ధికి ఇది చాలా తోడ్పడుతుందని యూఎన్ఎఫ్‍పీఏ డేటా పేర్కొంది. ఆర్థికంగా ఎదిగేందుకు కూడా ఇండియాకు చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

2022లో చైనా జనాభా ఏకంగా 85లక్షలు తగ్గింది. ఆ దేశ జనాభా ఈస్థాయిలో తగ్గడం 1961 తర్వాత ఇదే తొలిసారి.

తదుపరి వ్యాసం