Pravasi Bharatiya Divas 2023: ఇక అమృత కాలమే.. ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది: ప్రధాని మోదీ
09 January 2023, 15:10 IST
- Pravasi Bharatiya Divas 2023: భారత్ అమృతకాలంలో అడుగుపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అన్నారు. హార్ట్ ఆఫ్ ఇండియా వేదికగా ప్రవాసీ భారతీయ దివస్ జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇండోర్‌లో ఫుడ్ బాగుంటుందని కూడా ప్రవాస భారతీయులకు సూచించారు.
Pravasi Bharatiya Divas 2023: ఇక అమృత కాలమే.. ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది: ప్రధాని మోదీ
Pravasi Bharatiya Divas 2023: భారత్ అమృత కాలంలోకి అడుగుపెట్టిందని, దేశాభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రవాసీ భారతీయ దివస్ (Pravasi Bharatiya Divas) కన్వెన్షన్‍లో ఆయన పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఇండోర్ (Indore) వేదికగా సోమవారం (జనవరి 9) జరిగిన 17వ ఎడిషన్ ప్రవాసీ భారతీయ దివస్‍లో ఆయన ప్రసంగించారు. ప్రవాసులు: అమృత్ కాలంలో భారతీయ అభివృద్ధికి విశ్వసనీయమైన భాగస్వాములు (Diaspora: Reliable partners for India's progress in Amrit Kaal') అనే థీమ్‍తో ఈ ఏడాది ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. 70 దేశాల నుంచి వచ్చిన సుమారు 3,500 మంది ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే రానున్న 25 సంవత్సరాల కోసం భారత్ అమృతకాలంలోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పాత్రను మరింత ఉన్నతంగా మార్చేందుకు ప్రవాస భారతీయులు మరింత ప్రముఖ పాత్రను పోషించాలి. ప్రవాస భారతీయులు.. వారివారి రంగాల్లో చాలా గొప్ప విజయాలు సాధిస్తున్నారు” అని మోదీ అన్నారు.
‘హార్ట్ ఆఫ్ ఇండియా’లో జరగడం సంతోషం
PM Narendra Modi in Pravasi Bharatiya Divas 2023: మధ్య ప్రదేశ్‍ను ‘హార్ట్ ఆఫ్ ఇండియా’ అంటూ అభివర్ణించారు ప్రధాని మోదీ. ఇక్కడ ప్రవాసీ భారతీయ దివస్ జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. “భారత్‍కు హార్ట్ ఆఫ్ ఇండియాగా ఉన్న మధ్యప్రదేశ్‍లో ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇండోర్‌లో ఫుడ్‍ను మీరందరూ టేస్ట్ చేయాలని నేను కోరుతున్నా. నామ్‍కీన్ నుంచి పోహా వరకు ఇండోర్‌లో ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి.. మరిచిపోలేని రుచిని కలిగి ఉంటాయి” అని మోదీ అన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే..
PM Narendra Modi in Pravasi Bharatiya Divas 2023: ఆర్థికంగా ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఉందని ప్రధాని మోదీ అన్నారు. మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ (Startup Eco system) కూడా ఇండియానే అని ప్రవాసులకు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ మాన్యుఫాక్యరింగ్‍లో ప్రపంచానికి లీడర్‌గా మారుతోందని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‍పైవే చూస్తోందని చెప్పారు. “ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండడం, అంతర్జాతీయ గుర్తింపు వస్తుండడం.. భారతీయులందరినీ గర్వించేలా చేస్తోంది. రానున్న సంవత్సరాల్లో భారత్ మరింత పటిష్టమైన శక్తిగా ఎదుగుతుంది” అని మోదీ అన్నారు.