Income Tax Slab - Budget 2023: ఊరట: ఆదాయ పన్ను పరిమితి పెంపు.. పన్ను శ్లాబుల్లో మార్పు..
02 February 2023, 8:42 IST
- Income Tax Slab - Budget 2023: ఉద్యోగులకు శుభవార్త ఇది. ఆదాయ పన్ను పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.7లక్షలకు పెంచింది. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంపిక చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును కూడా కాస్త పెంచింది ప్రభుత్వం.
Income Tax Slab - Budget 2023:
Income Tax Slab - Budget 2023: దేశంలోని మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి(Income Tax Rebate Limit)ని రూ. 7 లక్షలకు పెంచింది. రిటర్నుల దాఖలు సమయంలో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంపిక చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
2023-24 బడ్జెట్‍లో నేడు (ఫిబ్రవరి 1) ఈ నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.
ఇక కొత్త పన్ను విధానంలోని శ్లాబులను 6 నుంచి 5కు కుదించారు. కొత్త పన్ను స్లాబ్ ప్రకారం రూ. 3 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంత కాలం రూ. 2.5 లక్షలుగా ఉన్న దీన్ని రూ. 3 లక్షలకు పెంచింది కేంద్రం. అంటే వార్షికంగా రూ. 3 లక్షల ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షలకు మించి వచ్చే ఆదాయంపై కొత్త స్లాబ్ రేట్ల ప్రకారం పన్నులు ఉంటాయి. రూ.7లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఈ పన్నుపై రిబేట్ పొందవచ్చు. వివరాలివే..
Income Tax Slab - Budget 2023: కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్లు
0 నుంచి రూ. 3 లక్షల వార్షికాదాయం - పన్ను లేదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వార్షికాదాయం - 5 శాతం పన్ను
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వార్షికాదాయం - 10 శాతం పన్ను
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వార్షికాదాయం - 15 శాతం పన్ను
రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం - 20 శాతం పన్ను
రూ. 15 లక్షలకు పైగా వార్షికాదాయం - 30 శాతం పన్ను
ఇప్పటి వరకు ఆరు శ్లాబులు ఉండగా.. దాన్ని ఇప్పుడు ఐదుకు కుదించింది ప్రభుత్వం. పన్ను శ్లాబుల్లో మార్పు వల్ల మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక పాత పన్నుల విధానంలో ట్యాక్స్ స్లాబుల్లో కేంద్రం మార్పులు చేయలేదు.
ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కావాలంటే పాత పన్ను విధానాన్ని కూడా కొనసాగించుకోవచ్చు. పాత పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారు మినహాయింపుల కోసం క్లయిమ్ చేసుకోవచ్చు.
మినహాయింపులు పోనూ పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ. 9 లక్షలు ఉంటే ఆదాయ పన్ను రూ. 45 వేలే చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు.