తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maoists: ఛత్తీస్ గఢ్ అడవుల్లో 130 మీటర్ల పొడవైన సొరంగం; మావోయిస్ట్ లు నిర్మించిన టన్నెల్ ను గుర్తించిన భద్రతా బలగాలు

Maoists: ఛత్తీస్ గఢ్ అడవుల్లో 130 మీటర్ల పొడవైన సొరంగం; మావోయిస్ట్ లు నిర్మించిన టన్నెల్ ను గుర్తించిన భద్రతా బలగాలు

HT Telugu Desk HT Telugu

31 January 2024, 18:21 IST

google News
  • Tunnel built by Maoists: ఛత్తీస్ గఢ్ లోని దంతేవాడ అడవుల్లో 130 మీటర్ల పొడవైన సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ సొరంగాన్ని మావోయిస్టులు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్ దళానికి చెందిన ఒక జవాను ఈ సొరంగాన్ని గుర్తించారు.

చత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు గుర్తించిన మావోయిస్టుల సొరంగం
చత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు గుర్తించిన మావోయిస్టుల సొరంగం

చత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు గుర్తించిన మావోయిస్టుల సొరంగం

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ లు భూగర్భ రహస్య స్థావరంగా నిర్మించిన 130 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని భద్రతా దళాలు బుధవారం గుర్తించాయి. దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ, 10 అడుగుల లోతైన సొరంగాన్ని స్థానిక గిరిజన యువకులతో కూడిన జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) జవాను మొదట గుర్తించాడని చెప్పారు. ఆ రహస్య స్థావరాన్ని ఎవరూ గుర్తించకుండా దానిపై చెత్త వేశారని తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఓ జవాను ఆ సొరంగాన్ని కనిపెట్టగలిగాడని ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్పారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు తాము కనుగొన్న అతిపెద్ద రహస్య స్థావరం ఇదేనని రాయ్ తెలిపారు.

మావోల రహస్య స్థావరం

బలగాల తరలింపు సమయంలో మావోయిస్టుల రహస్య స్థావరంగా ఇది ఉండేదని భావిస్తున్నామని ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. అలాగే, దీన్ని పోలీసు బలగాలపై ఆకస్మికంగా దాడి చేయడానికి, ఇతర అవసరాలకు కూడా వినియోగించుకునే ఉద్దేశంతో నిర్మించి ఉంటారని ఎస్పీ తెలిపారు.

ఎన్ కౌంటర్

అబూజ్ మఢ్ అటవీ ప్రాంతంలోని భైరంగఢ్ పోలీస్ స్టేషన్ కు 12 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ తెలిపారు. దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) ఉన్నత స్థాయి డివిజనల్ కమిటీ సభ్యుడు మల్లేష్ తో సహా 25-30 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలను మోహరించారు. తడోపట్ గ్రామ సమీపంలో మావోయిస్టులతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి వారిని బలవంతంగా అడవుల్లోకి పారిపోయేలా చేశాయి. తిరిగి వస్తుండగా మావోయిస్టులు నిర్మించిన ఈ సొరంగాన్ని గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో కొందరు మావోయిస్టులు మరణించి ఉంటారని, అయితే తమకు ఎలాంటి మృతదేహాలు లభించలేదని దంతెవాడ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

సొరంగం వీడియో వైరల్

దంతేవాడ అడవుల్లో గుర్తించిన సొరంగాన్ని జిల్లా పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మావోయిస్టులు సొరంగంలోని యాక్సెస్ పాయింట్లను మట్టి, కర్రలతో ఎలా కప్పారో చూపించారు. ఇరుకైన సొరంగంలో ప్రతి ఆరు మీటర్లకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి రహస్య స్థావరాలు గతంలో అబూజ్ మఢ్ ప్రాంతంలో కనిపించాయని, ప్రధానంగా మావోయిస్టు అగ్రనేతలకు రహస్య స్థావరాలుగా ఉపయోగించేవారని తెలుస్తోంది.

సీనియర్ నాయకుడి కోసం..

‘‘ఇది సీనియర్ సభ్యులకు స్థావరంగా తయారు చేసిన ఒక రకమైన బంకర్. ఆ బంకర్ లో ఎవరైనా నడవవచ్చు, వెలుతురు వచ్చే వీలు కూడా ఉంది. అది ఎవరో సీనియర్ నాయకుడి కోసం ఏర్పాటు చేసిన సొరంగంగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు’’ అని స్పెషల్ డైరెక్టర్ జనరల్ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) గా పనిచేసిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఆర్కే విజ్ చెప్పారు. ఇలాంటి సొరంగాలు, బంకర్లను గతంలో కూడా కనుగొన్నామని విజ్ తెలిపారు. 2012లో బీజాపూర్ లో మావోయిస్టు అగ్రనేత గణపతి ఉపయోగించిన 80 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత బీజాపూర్లోని కెర్పర్ ప్రాంతంలో కంప్యూటర్లు, ఇతర సామగ్రిని నిల్వ చేయడానికి ఉపయోగించే సొరంగాన్ని కనుగొన్నాం' అని విజ్ చెప్పారు.

తదుపరి వ్యాసం