ఎయిర్ ఇండియాకు షాక్.. కారణం ఆర్ఎస్ఎస్!
01 March 2022, 14:52 IST
Air India CEO news | ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసి త్వరలో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తాజాగా.. ఆ పదవిని చేపట్టబోనని ఐసి తేల్చిచెప్పారు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది.
ఇల్కర్ ఐసి
Air India CEO | ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా.. టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసిని టాటా సన్స్ సంస్థ నియమించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. తాను ఆ బాధ్యతలు స్వీకరించబోనని ఐసి ప్రకటించారు. ఈ విషయాన్ని టాటా గ్రూప్ సైతం ధృవీకరించింది.
ఐసి తప్పుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. ఈ నెల 14న ఆయన్ని సీఈఓగా నియమించింది టాటా సన్స్. కాగా.. వారం రోజులకే ఆ సంస్థ నిర్ణయంపై దేశంలో వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా.. ఐసి నియామకానికి అంగీకరించొద్దని కేంద్రానికి ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి చేసింది. టర్కీ రాజకీయాలు, అక్కడి నేతలతో ఐసికి ఉన్న సంబంధాలు దేశానికి కీడు చేస్తాయని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
భారత్లో.. ఏదైనా సంస్థకు విదేశీ సీఈఓను నియమించాలంటే.. అందుకు ప్రభుత్వ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. కాగా.. టర్కీతో ఇటీవలి కాలంలో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడంతో ఐసి నియామకంపై ప్రభుత్వం కూడా అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాధారణం కన్నా ఎక్కువగా ఐసిపై భద్రతాపరమైన తనిఖీలు చేసినట్టు సమాచారం.
ఎయిర్ ఇండియా సీఈఓగా ఏప్రిల్ 1న ఐసి బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలతో.. తాను ఆ స్థానాన్ని తీసుకోబోనని ఐసి ప్రకటించారు. టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు.
"ఎయిర్ ఇండియా సీఈఓగా నన్ను ఎంపిక చేయడంపై అనవసరమైన రాజకీయ రంగులు పులుముతున్నారు. ఓ వ్యాపార నేతగా.. నేను ఎప్పుడూ నా వృత్తికే అధిక ప్రాధాన్యతనిచ్చాను. తాజా పరిణామాలతో.. ఇక నేను ఈ ఆఫర్ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే మంచిదని అనిపించింది," అని ఐసి వెల్లడించారు.
టాటాకు మరిన్ని చిక్కులు..!
Air India | ఎయిర్ ఇండియా.. ఇటీవలే అధికారికంగా టాటా గ్రూప్లో చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కొత్త సీఈఓను ప్రకటించింది. అంతా సజావుగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో.. ఐసి తప్పుకున్నారు. ఫలితంగా ఇప్పుడు మళ్లీ కొత్త సీఈఓను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా పరిణామాలపై ఎయిర్ ఇండియా, టాటా సన్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎయిర్ ఇండియాకు సీఈఓ అంటే చాలా క్లిష్టమైన ఉద్యోగమే అని చెప్పాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థను విజయవంతంగా నడిపించాలంటే, అందుకు తగ్గట్టు నాయకత్వం సైతం ఉండాలి. మరి ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎవరిని సీఈఓగా ఎంపిక చేస్తుందనేది చూడాల్సి ఉంది.
ప్రస్తుతం.. ఎయిర్ ఇండియా చేతిలో 4,400 స్వదేశీ, 1,800 విదేశీ ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి.
1932లో టాటా ఎయిర్లైన్స్ పుట్టింది. 1946లో దానిని ఎయిర్ ఇండియాగా నామకరణం చేశారు. 1953లో అది ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇటీవలే తిరిగి టాటాలతో చేరింది.