లఖింపూర్ కేసు: ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్ట్
05 May 2023, 15:23 IST
- Lakhimpur Kheri ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైన రోజే బెయిల్ రావడం గమనార్హం.
Lakhimmpur Kheri, Ashish Mishra- (File Photo)
Allahabad | సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైన రోజే బెయిల్ రావడం గమనార్హం.
గతేడాది అక్టోబర్ 3న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి వద్ద రైతులు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. రోడ్డుపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఆశిష్ మిశ్రా ప్రయాణిస్తున్న SUV కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఒక జర్నలిస్టు కారు చక్రాల కింద నలిగి దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు సహా ముగ్గురు పౌరులు బలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తండ్రికి అధికారం ఉందనే మదంతోనే ఆశిష్ మిశ్రా నిర్ధాక్షణ్యంగా వ్యవహరించి ఎనిమిది చావులకు కారణమయ్యారని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఇంత జరిగినా పోలీసులు ఆశిష్ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్రదుమారం రేగింది. ఈ ఘటనలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ (సిట్) దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఆశిష్ మిశ్రాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఎట్టకేలకు అక్టోబర్ 9న పోలీసులు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
లఖింపూర్ ఖేరీలోని కోర్టులు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను తిరస్కరించాయి. దీంతో అప్పట్నించీ జైలులోనే ఉన్న ఆశిష్‌కు ఈరోజు షరతులతో కూడిన బెయిల్‌ను అలహాబాద్ హైకోర్ట్ మంజూరు చేసింది.
తదనంతర పరిణామాలతో రైతుల ఆందోళనలు మరింత తీవ్రతరం కావడంతో 11 నెలల తర్వాత ఎట్టకేలకు నవంబర్‌లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతుండగా నాలుగో విడతలో ఖేరి నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ బేజేపీ ఎంపీగా ఉన్న అజయ్ మిశ్రాను ప్రచారం కోసం ఆ పార్టీ ఉపయోగించుకోవడం లేదు. లఖింపూర్ ఖేరి ఘటన తర్వాత విపక్షాలు అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినా ఆయన ఇంకా మంత్రివర్గంలో కొనసాగుతుండటం విశేషం.
టాపిక్