Hamas - Israel war: ‘10 మంది యూదులను నా చేతులతో చంపేశా’- తల్లిదండ్రులతో గొప్పలు చెప్పుకున్న హమాస్ మిలిటెంట్
25 October 2023, 14:20 IST
Hamas - Israel war: 10 యూదులను తన చేతులతో స్వయంగా చంపేశానని ఒక హమాస్ మిలిటెంట్ తన తల్లిదండ్రులతో గొప్పగా చెప్పుకుంటున్న ఆడియో రికార్డింగ్ వైరల్ గా మారింది. ఈ ఆడియో రికార్డింగ్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసింది.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధ బీభత్సం
Hamas - Israel war: ఒక హమాస్ మిలిటెంట్ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఆడియో రికార్డింగ్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) విడుదల చేసింది. దాదాపు 20 రోజుల క్రితం ఇజ్రాయెల్ లోకి చొరబడి అక్కడ మారణ హోమం సృష్టించిన హమాస్ మిలిటెంట్లలో ఒకరు.. 10 మంది యూదులను చంపేశానని తన తల్లిదండ్రులతో గొప్పగా చెప్పుకుంటున్నట్లుగా ఆ రికార్డింగ్ లో ఉంది.
గర్వంగా ఉంది.
‘‘చూడు ఎంత మందిని చంపేశానో.. మీ కొడుకు 10 మంది యూదులను తన చేతులతో స్వయంగా చంపేశాడు’’ అంటూ ఆ మిలిటెంట్ తన తల్లిదండ్రులతో గొప్పగా చెప్పుకుంటున్నట్లుగా అందులో ఉంది. ఇజ్రాయెల్ లోని ఒక ఇంట్లోకి చొరబడి ఆ కుటుంబాన్ని చంపేశానని, వారి ఫోన్ లో నుంచే మాట్లాడుతున్నానని ఆ మిలిటెంట్ తన పేరెంట్సో చెబుతున్నట్లుగా అందులో ఉంది. ‘నా వాట్సాప్ ఓపెన్ చేయండి. అందులో లైవ్ చూడండి. నేను ఎంతమందిని చంపుతున్నానో. ఆ వివరాలన్నీ అందులో ఉన్నాయి. 10మందిని చంపేశాను. మీరు తలెత్తుకుని గర్వంగా ఉండండి’’ అని ఆ యువకుడు తన పేరెంట్స్ తో చెబుతున్నట్లుగా ఆ ఆడియో రికార్డింగ్ లో ఉంది.
ఐరాసపై విమర్శలు
ఈ ఆడియో రికార్డింగ్ ను మొదట ఐరాస భద్రతా మండలికి పంపించామమని ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి వెల్లడించారు. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ నియంత్రణ కొనసాగించడం వల్లనే హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసిందని, హమాస్ ను సమర్ధిస్తున్నట్లుగా గ్యుటెరస్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ మండిపడింది. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి గ్యుటెరస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.