Gujarat polls: బీజేపీ మాస్టర్ స్ట్రోక్.. సగం మంది సిట్టింగ్‌లకు నో టికెట్..
09 December 2022, 18:26 IST
- Gujarat polls: గుజరాత్‌లో దాదాపు సగానికి సగం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. దాదాపు వీరంతా గెలుపొందారు.
రాజీనామా సమర్పిస్తున్న భూపేంద్ర పటేల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రంగంలోకి దిగిన 45 మంది కొత్త అభ్యర్థుల్లో ఇద్దరు మినహా మిగతా అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్‌ను తగ్గించే ప్రయత్నంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 45 మంది ఎమ్మెల్యేలకు అధికార పార్టీ టికెట్ ఇవ్వలేదు.
గుజరాత్‌లో కాషాయ పార్టీ 27 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్త అభ్యర్థులు గెలుపొందడంతో వ్యూహం ఫలించింది. అయితే బొటాడ్, వాఘోడియాలో కొత్త అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బొటాడ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇంధన శాఖ మాజీ మంత్రి సౌరభ్ పటేల్‌ను పక్కనబెట్టి ఘనశ్యామ్ విరానీని బీజేపీ బరిలోకి దింపింది. పటేల్ 1998, 2002, 2007, 2017లో ఈ సీటును గెలుచుకున్నారు. 2012లో బీజేపీకి చెందిన టీడీ మానియా ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. విరానీ ఆప్‌కి చెందిన ఉమేష్ మక్వానా చేతిలో 2,779 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
వడోదర జిల్లాలోని వాఘోడియా నియోజకవర్గంలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మధు శ్రీవాస్తవ స్థానంలో అశ్విన్ పటేల్‌ను బరిలోకి దింపింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ టికెట్ ఆశించిన మరో అభ్యర్థి ధర్మేంద్రసింగ్ వాఘేలా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పటేల్‌పై దాదాపు 14 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. శ్రీవాస్తవ 14,645 ఓట్లతో నాలుగో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థికి 18,870 ఓట్లు వచ్చాయి. అయితే మిగతా అన్ని చోట్లా బీజేపీ కొత్తవారు విజయం సాధించారు.
2022లో టికెట్లు దక్కని ప్రముఖ ఎమ్మెల్యేలలో మాజీ ముఖ్యమంత్రి రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మాజీ హోం మంత్రి ప్రదీప్‌సిన్హ్ జడేజా, మాజీ రెవెన్యూ మంత్రి కౌశిక్‌భాయ్ పటేల్, స్పీకర్ నిమాబెన్ ఆచార్య, గుజరాత్ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆర్‌సి ఫల్దు ఉన్నారు.