Congress: హైకమాండ్ కు గులాం నబీ ఆజాద్ షాక్
17 August 2022, 7:59 IST
- ghulam nabi azad: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆ పార్టీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి.. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ghulam nabi azad
ghulam nabi azad resigned: జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం పలు కమిటీలను కూడా ప్రకటించింది. అయితే పదవి ప్రకటించిన గంటల వ్యవధిలోనే గులాం నబీ ఆజాద్... హైకమాండ్ కు షాక్ ఇచ్చారు. పదవి బాధ్యతలను స్వీకరించేందుకు నిరాకరించారు. మరోవైపు.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులను ఆజాద్ నిర్వర్తించారు. రెండేళ్ల క్రితం పార్టీలో సంస్థాగత మార్పులు కావాలని కోరుతూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఆయన ఒకరు. అప్పట్నుంచి... పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన గులామ్ అహ్మెద్ మిర్.. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఈ విషయంలోనూ ఆజాద్ అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పదవిని వికార్ వసూల్ వనీకి కట్టుబెడుతూ కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆజాద్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో పీసీసీని మంగళవారం పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థీకరించింది కాంగ్రెస్. ప్రచారం కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ, పబ్లికేషన్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ, ఎన్నికల కమిటీలను నియమించింది. పీసీసీ చీఫ్‌గా వికార్ వసూల్ వనీని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమణ్ భల్లాను ప్రకటించింది. ఇక ప్రచార కమిటీ చీఫ్‌గా ఆజాద్ ను నియమించంగా... ఆయన నిరాకరించారు.
కారణం ఇదేనా...!
అయితే అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆజాద్ పదవులను తీసుకునేందుకు నిరాకరించినట్లు పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆజాద్.
ఇక రాష్ట్రానికి కొత్త పీసీసీ నియామకంపై పలువురు కాంగ్రెస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే నియమించారని విమర్శించారు. ఈ క్రమంలో పార్టీలోని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ దర్ ప్రకటించారు.