జీడీపీ 8.7%, చివరి త్రైమాసికంలో తగ్గిన వృద్ధి రేటు
31 May 2022, 22:40 IST
ఈ ఆర్థిక సంవత్సరంలో, గత మూడు త్రైమాసికాల కన్నా అతితక్కువ వృద్ధి రేటును భారత్ నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి - మార్చ్)లో భారత జీడీపీ వృద్ధి రేటును 4.1 శాతంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మంగళవారం నిర్ధారించింది.
ప్రతీకాత్మక చిత్రం
భారత జీడీపీలో గత మూడు త్రైమాసికాల కన్నా తక్కువ వృద్ధి రేటు నమోదైందని ఎన్ఎస్ఓ ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సర జీడీపీని 8.7 శాతంగా పేర్కొంది. చివరి త్రైమాసికంలో వృద్ధి రేటులో తగ్గుదలకు కారణం కోవిడ్ మూడో వేవ్ భయాలు, ద్రవ్యోల్బణమని నిపుణులు పేర్కొన్నారు. వాటికి ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం తోడవడంతో జీడీపీ వృద్ధి రేటు మందగించిందని వివరించారు. ఇదే కాలంలో చైనా జీడీపీలో 4.8% వృద్ధి రేటు నమోదైంది. భారత జీడీపీలోఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 20.3% , రెండో త్రైమాసికంలో 8.5%, మూడో త్రైమాసికంలో 5.4% వృద్ధి రేటు నమోదైంది.
కోవిడ్ ముందు నాటి కన్నా బెటర్..
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి కోవిడ్ ముందు నాటి 2019-20 ఆర్థిక సంవత్సరం కన్నా మెరుగ్గా ఉందని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. అయితే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పెరిగిన ధరలు, కోవిడ్ మూడో వేవ్ భయాలు చివరి త్రైమాసికంలో వృద్ధి రేటును తగ్గించాయన్నారు. అయితే, సేవల రంగం గణనీయంగా మెరుగుపడడంతో 4.1 శాతం వృద్ధి సాధ్యమైందన్నారు. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.6% కాగా, ఈ సంవత్సరం అది 8.7 శాతానికి పెరిగింది. ఇది గణనీయమైన వృద్ధి కానే పరిగణించాలని కాలరీస్ సంస్థ భారత విభాగం సీఈఓ రమేశ్ నాయర్ అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామనడానికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు.
గతం కన్నా మెరుగ్గా సీపీఐ
ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) జనరల్ ఇండెక్స్ 6.3% చూపగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సీపీఐ జనరల్ ఇండెక్స్ 4.9 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సంబంధిత సేవల్లో వృద్ధి 12.6% నమోదయింది. ఇవే రంగాల్లో గత ఆర్థిక సంవత్సరం నమోదైన వృద్ధి 5.5 శాతం మాత్రమే. అలాగే, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 4.2 % వృద్ధి నమోదు కాగా, గత సంవత్సరం అది 2.2% మాత్రమే.
పారిశ్రామికంగానూ బెటర్
నిర్మాణ పరిశ్రమలో ఈ ఆర్థిక సంవత్సరం 11.5% వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇది -7.3 శాతం(నెగెటివ్ గ్రోత్). తయారీ పరిశ్రమలో ఈ ఆర్థిక సంవత్సరం 9.9% వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇది -0.6 శాతం(నెగెటివ్ గ్రోత్). కాగా, వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్ ఇండస్ట్రీల్లో మాత్రం గత ఆర్థిక సంవత్సరమే మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఈ ఇండస్ట్రీల్లో ఆర్థిక వృద్ధి 3.3 శాతం కాగా, ఈ ఆర్థిక సంవత్సరం అది 3 శాతం. మైనింగ్, క్వారీయింగ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం 11.5% వృద్ధి రేటు నమోదైంది. గత సంవత్సరం ఇది -8.6%.
రూ. 147.36 లక్షల కోట్లు
(2011-12) ధరల ప్రకారం 2021- 22 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ రూ. 147.36 లక్షల కోట్లని ఎన్ఎస్ఓ నిర్ధారించింది.
టాపిక్