తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Students: విద్యార్థులకు ఉచితంగా విమానం, రైల్ ట్రిప్స్: ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ ఆఫర్

Students: విద్యార్థులకు ఉచితంగా విమానం, రైల్ ట్రిప్స్: ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ ఆఫర్

27 November 2022, 17:07 IST

google News
    • Free trip for Students: ఆయా తరగతుల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు ఉచితంగా విమాన, రైల్, రోడ్ ట్రిప్‍లకు పంపిస్తానని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకటించారు. ఆయనే ఖర్చులన్నీ భరించనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Free trip for Students: చదువుపై విద్యార్థులు మరింత శ్రద్ధ చూపేలా ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఓ కొత్త పద్ధతిని పాటిస్తున్నారు. స్టూడెంట్లలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా తరగతుల్లో అధిక మార్కులు సాధించే టాపర్లను ఉచితంగా విహార యాత్రలకు పంపుతున్నట్టు ప్రకటించారు. తన సొంత ఖర్చులతో విమానం, రైలు, బస్సుల్లో విద్యార్థులను ట్రిప్‍లకు పంపనున్నట్టు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‍లోని బలగ్ గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెంకడరీ స్కూల్ ప్రిన్సిపాల్ సందీప్ శర్మ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. షిమ్లాకు ఈ గ్రామం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తరగుతులను బట్టి ప్రయాణం

Free trip for Students: 11వ, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను విమానంలో యాత్రకు పంపనున్నారు. చండీగఢ్ లేదా ధర్మశాలకు ఆ విద్యార్థులు వెళ్లవచ్చు. ఇక 9వ, 10వ తరగతుల్లో ఎక్కువ మార్కులు సాధించిన టాపర్లకు ఢిల్లీ ట్రిప్ ఉంటుంది. కాల్కా-న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్ ప్రెస్‍లో వీరు ప్రయాణిస్తారు. ఇక 6, 7, 9 తరగతుల్లో టాప్‍లో నిలిచిన విద్యార్థులు రోడ్ ట్రిప్ ద్వారా చండీగఢ్‍ను సందర్శించవచ్చు. ఈ వివరాలను ప్రిన్సిపాల్ సందీప్ శర్మ వెల్లడించారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీని పెంచేందుకు, మరింత శ్రద్ధగా చదివేందుకు ఇది స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు.

విద్యార్థులు ఉత్సాహంగా…

Free trip for Students: “విద్యార్థుల్లో ఇది స్ఫూర్తి నింపడమే మాత్రమే కాదు.. వారిలోని ప్రతిభ అందరికీ తెలుస్తుంది. వీరిలో ఎక్కువ మంది ఇప్పటి వరకు పెద్ద నగరాలను చూడలేదు. ఇప్పటికే విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు” అని ప్రిన్సిపాల్ సందీప్ శర్మ చెప్పారు. విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వడం కంటే ఇలా విహార యాత్రకు పంపడమే మంచి ఆలోచన అని శర్మ అభిప్రాయపడ్డారు. దీని వల్ల కొత్త విషయాలను చూసేందుకు, నేర్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం ఉందని, ఆత్మవిశ్వాసంగా ఫీలవుతారని అన్నారు. ఈ నిర్ణయం ప్రకటించాక.. విద్యార్థులు మరింత ఎక్కువ సమయం చదువుతున్నారని తెలిపారు.

తాను చదివిన పాఠశాలకు..

చిన్నతనంలో తాను చదువుకున్న పాఠశాల పునరుద్ధరణ కోసం కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు సందీప్ శర్మ. చెయోగ్‍లోని పాఠశాల రెనోవేషన్ కోసం ఇప్పటి వరకు సుమారు రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం