FM visits Local Market: మార్కెట్ లో కూరగాయలు కొన్న కేంద్రమంత్రి - వీడియో వైరల్
09 October 2022, 8:59 IST
FM visits local market in Chennai: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ లోకల్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత.. అక్కడున్న సామాన్య ప్రజలు, కూరగాయలను విక్రయించేవారితో కాసేపు సంభాషించారు. అంతేకాదు తాను కూడా కూరగాయలను కొన్నారు.
లోకల్ మార్కెట్ లో కూరగాయలు కొంటున్న కేంద్రమంత్రి
finance minister nirmala sitharaman visit a local market: నిర్మలా సీతారామన్... కేంద్ర ఆర్థికమంత్రి..! ఇక ఆమె చేసే పలు పర్యటనలు ఆసక్తికరంగా ఉంటాయి. కొద్దిరోజుల కిందట తెలంగాణలోని రేషన్ షాపులను సందర్శించిన ఆమె... వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా తమిళనాడులోని ఓ లోకల్ మార్కెట్ కి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శనివారం తమిళనాడు రాజధాని చెన్నై పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం నుంచి రాత్రి దాకా నగరంలో బిజీబిజీగా గడిపారు. తన షెడ్యూల్ మేరకు అన్ని కార్యక్రమాలను ముగించుకున్న ఆమె... రాత్రి నగరంలోని మైలాపూర్ మార్కెట్‌లో ఆగారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారులతో ఆమె మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొంత మంది కూరగాయలు కొనేవారితో కూడా కేంద్రమంత్రి మాట్లాడారు. అంతేకాదండోయ్... తాను కూడా కొన్ని కూరగాయాలను కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరేమో ధరలపై ప్రశ్నిస్తూ ట్వీట్లు చేయగా... మరికొందరేమో కేంద్రమంత్రి సింప్లిసిటీని ప్రశంసిస్తూ రాసుకొచ్చారు. అంతకుముందు చెన్నైలోని అంబటూరులో ఆనంద కరుణ విద్యాలయం సెంటర్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి. ఈ సెంటర్ దివ్యాంగ పిల్లల కోసం ఏర్పాటు చేశారు.
టీఆర్ఎస్ పై ఫైర్....
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తెలంగాణకు ఏంచేయలేకపోయిన కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్... రాష్ట్ర ఏర్పాటు రోజు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ... ఇవాళ రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు.2014 నుంచి 2018 వరకు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని విమర్శించారు. మహిళలను మంత్రివర్గంలో పెట్టుకుంటే మంచిది కాదని తాంత్రికుడు చెప్పడంతో మహిళలకు అవకాశం కల్పించలేదని ఆరోపించారు. మంత్రాలు, తంత్రాలు అంటూ కేసీఆర్ సచివాలయానికి వెళ్లడంలేదన్నారు.
ఇక కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.