తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Traffic Case : అత్యాచార ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు

Traffic Case : అత్యాచార ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసు

Anand Sai HT Telugu

21 August 2024, 12:49 IST

google News
    • Bengaluru Rape Case : బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో బైకర్ అత్యాచారయత్నంలో 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమెపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఆటో రిక్షాను ఢీకొట్టినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో అత్యాచార ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళపై ట్రాఫిక్ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 18న కోరమంగళలోని ఓ పబ్‌లో పార్టీకి 21 ఏళ్ల విద్యార్థిని వెళ్లింది. పార్టీ ఆయ్యాక ఆమె స్నేహితుడితో తిరిగి వస్తుంది. మద్యం మత్తులో కారు నడుపుతోంది. మంగళ జంక్షన్ సమీపంలో కారు, బైక్‌, ఓ ఆటో రిక్షాను ఢీ కొట్టింది. అయినప్పటికీ వాహనం ఆపకుండా ఫోరమ్ మాల్ వైపు డ్రైవింగ్ కొనసాగించింది.

దీంతో ఆటో డ్రైవర్ ఆమె కారును వెంబడించి ఆపాడు. చివరకు ఫోరమ్ మాల్ దగ్గర ఆగినప్పుడు ఆమెను దిగమని గొడవ పెట్టుకున్నాడు. ఇది ఆటో డ్రైవర్లతో ఘర్షణకు దారితీసింది. దీంతో మహిళ భయంతో పోలీసు హెల్ప్‌లైన్ 112కి కాల్ చేసింది. తర్వాత తన వాహనంతోపాటు స్నేహితుడిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

బైక్ పై వెళ్లిన మహిళ

డ్రైవర్‌తో వివాదాన్ని పరిష్కరించిన తర్వాత స్నేహితుడు మహిళ కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ అప్పటికే ఆమె రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని ఆపి బైక్‌పై లిఫ్ట్ అడిగింది. మెుదట ఒక వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చేందుకు నిరాకరించాడు. తర్వాత మరో వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆమె పరిస్థితిని గమనించిన బైకర్ హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు.

ఎమర్జెన్సీ అలర్ట్ తో పోలీసులు

ప్రమాదాన్ని గ్రహించిన మహిళ తన ఫోన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్ యాప్‌ను యాక్టివేట్ చేసింది. తన లైవ్ లొకేషన్‌ను తన స్నేహితుడు, తండ్రితో షేర్ చేసింది. వెంటనే గమనించిన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు సిబ్బంది ఆమె స్థానాన్ని ట్రాక్ చేసి ఘటన స్థలానికి వెళ్లారు. పోలీసు వాహనం సమీపిస్తున్నట్టుగా తెలుసుకున్న బైకర్ ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. అప్పటికే ఆమెపై దాడి చేసి, ఆమె బట్టలు చింపేశాడు. పోలీసులు మహిళను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆమెపై ట్రాఫిక్ కేసు

'ఆర్మీ అధికారి కుమార్తె అయిన అమ్మాయి, మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఆటో-రిక్షాను ఢీకొట్టి దానిని పాడు చేసింది. ఘటన జరిగిన వెంటనే ఆగలేదు. విద్యార్థిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మేము ఆమెకు నోటీసు జారీ చేస్తాం అవసరమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థినితోపాటుగా ఆమె స్నేహితుడిపై BNS సెక్షన్ 281 ​​(ర్యాష్ అండ్ అజాగ్రత్త డ్రైవింగ్), మోటారు వాహన చట్టం కింద ఆటో రిక్షా డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసాం.' అని అడుగోడి ట్రాఫిక్ పోలీసులు ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.

నిందితుడు అరెస్టు

ఈ కేసులో బెంగళూరులో డ్యాన్స్ టీచర్ ముఖేశ్వరన్ అనే నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్ జోన్) రామన్ గుప్తా మాట్లాడుతూ, మహారాష్ట్రకు చెందిన మహిళ నగర శివార్లలోని ఒక ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని అని తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం