Fact Check: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు
16 May 2024, 9:42 IST
- “రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అడ్వాణీ అన్నారని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.
రాహుల్ గాంధీని అడ్వానీ ప్రశంసించినట్టుగా సర్క్యులేట్ అయిన పోస్టు
క్లెయిమ్: దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అడ్వాణీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.
ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కొన్ని మీడియా సంస్థలు ఎల్.కే.అడ్వాణీకి తప్పుగా ఈ వ్యాఖ్యలను ఆపాదించాయి. తదుపరి వారు తమ వెబ్సైట్ నుండి ఈ కథనాలను తొలగించారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ అవుతున్న పోస్టులో “రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి ఎల్.కే.అడ్వాణీ అన్న వ్యాఖ్యలు ‘avadhbhoomi.com’ అనే వెబ్సైటు నుండి తీసుకున్నట్టు ఉంది. దాంతో ఈ వెబ్సైటులో ఈ వ్యాఖ్యల గురించి వెతికితే దీనికి సంబంధించిన ఏ కథనం లభించలేదు. కానీ, ఈ కథనం యొక్క ఆర్కైవ్ లింక్ లభించింది.
పైన లభించిన సమాచారం ప్రకారం, ఎల్.కే.అడ్వాణీ, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని భారత రాజకీయాల హీరో అన్నాడని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పోస్ట్ ని నిజంగానే ‘Avadhbhoomi’ అనే లోకల్ న్యూస్ వెబ్సైటు 8 మే 2024న ప్రచురించిందని తెలుస్తుంది. అంతేకాక, ‘Townhall Times’ అనే న్యూస్ ఏజెన్సీ కూడా ఎల్.కే.అడ్వాణీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేసినట్టు ఇలాంటి కథనాన్నే రిపోర్ట్ చేసింది. కానీ, అడ్వాణీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. నిజంగానే, అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తని ప్రచురించేవి.
పైన పేర్కొన్న రెండు మీడియా సంస్థలు ఈ కథనాలను తమ వెబ్సైట్ల నుండి తొలగించాయి. అంతేకాక, ఈ విషయం వైరల్ అవడంతో ‘Townhall Times’ అడ్వాణీ రాహుల్ గాంధీ గురించి ఏ వ్యాఖ్యలు చేయలేదని, ఈ వార్త తప్పని స్పష్టం చేస్తూ 11 మే 2024న తమ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీకి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలే ‘న్యూ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ కార్యదర్శి అరుణ్ మజీ చేశారని వారు ఇందులో పేర్కొన్నారు. మేము వారితో చేసిన కరెస్పాండెన్స్ లో కూడా ఇదే విషయాన్నీ వారు వివరించారు.
అంతేకాక, ఎల్.కే.అడ్వాణీ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన దీపక్ చోప్రా ABPతో మాట్లాడుతూ అడ్వాణీ రాహుల్ గాంధీ ఫై ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ధృవీకరించారు.
చివరగా, “రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని ఎల్.కే.అడ్వాణీ అనలేదు. ఈ వ్యాఖ్యలు ఎల్.కే.అడ్వాణీ అన్నట్టు ఆయనకు తప్పుగా ఆపాదిస్తున్నారు.
ఈ కథనం తొలుత ఫ్యాక్ట్‌లీ ప్రచురించింది. ఫ్యాక్ట్ చెక్ కోసం శక్తి కలెక్టివ్‌లో భాగంగా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనిని తిరిగి ప్రచురించింది.