`స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ.. ఇప్పుడు ప్రధాని మోదీ..!`
11 May 2022, 16:15 IST
ప్రధాని మోదీ గొప్పదనాన్ని ఆయన వ్యతిరేకులు కూడా అంగీకరిస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన వ్యక్తిత్వం అద్భుతమైనదని, దాన్ని ఎవరూ కూడా ఉపేక్షించలేరని ప్రశంసించారు.
`Modi @ 20 Dreams Meet Delivery` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యక్తిత్వం అద్భుతమైనదని, దాన్ని ఎవరూ ఉపేక్షించలేరని పేర్కొన్నారు. మోదీని వ్యతిరేకించేవారు కూడా ఆయన గొప్పదనాన్ని అంగీకరిస్తారన్నారు. స్వతంత్య్ర సంగ్రామ సమయంలో.. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖుల చేతుల్లో నుంచి స్వాతంత్య్రోద్యమాన్ని సామాన్యుల చేతుల్లోకి చేర్చి, దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మహాత్మాగాంధీ మలిచారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. అదేవిధంగా, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రజా ఉద్యమాలుగా మార్చారని ఆయన కొనియాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వయంగా రూపొందించి, విజయవంతంగా చేపట్టిన కార్యక్రమాలను.. ఇప్పుడు ప్రధానిగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని వెంకయ్యనాయుడు వివరించారు.
`Modi @ 20 Dreams Meet Delivery`
`Modi @ 20 Dreams Meet Delivery` పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. విస్తృత ప్రయాణాలు, లోతైన ఆలోచనలు, అనుభవాలతో కూడిన జీవన ప్రస్థానం ప్రధాని మోదీకి దేశాభివృద్ధి పట్ల ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ఇలాంటి నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో ఎవరూ లేరని ప్రశంసించారు. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో మోదీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. `ప్రధాని మోదీ ఒక అద్భుతం. ఆయనది ఉపేక్షించలేని వ్యక్తిత్వమని ఆయన విమర్శకులు, వ్యతిరేకులు కూడా ఒప్పుకుంటారు. ఎలాంటి పాలనానుభవం లేకుండా మొదట ముఖ్యమంత్రిగా, ఆ తరువాత ప్రధానమంత్రిగా దేశీయంగా, అంతర్జాతీయంగా గొప్ప విజయాలు సాధించిన వ్యక్తి మరొకరు లేరు` అని వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. `Modi @ 20 Dreams Meet Delivery` పుస్తకం మోదీ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, నాయకత్వ విధానాలను గొప్పగా వివరించిందన్నారు.
అభివృద్ధిలో జాప్యం మోదీకి నచ్చదు
అభివృద్ధి వేగంగా సాగాలని ప్రధాని మోదీ కోరుకుంటారని వెంకయ్యనాయుడు తెలిపారు. 70 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో ఇంకా సమస్యలు ఉండడమేంటని మోదీ అసహనం వ్యక్తం చేస్తుంటారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత కూడా తన వాక్చాతుర్యంతో, ప్రజలకు ఆయన పట్ల ఉన్న విశ్వాసంతో ఎన్నికల్లో పార్టీని గెలిపించారని గుర్తుచేశారు. మోదీ దార్శనికత వెనుక మహాత్మాగాంధీ, స్వామీ వివేకానంద, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయల జీవితాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఉన్నాయని వెంకయ్య వివరించారు. ఈ పుస్తకంలో హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు.. మోదీ 24*7 రాజకీయ నాయకుడని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. `Modi @ 20 Dreams Meet Delivery` పుస్తకాన్ని మోదీపై ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన వ్యాసాలతో బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ రూపొందించింది. మోదీ 20 ఏళ్లకు పైబడిన రాజకీయ ప్రస్థానాన్ని ఈ బుక్ సమగ్రంగా వివరిస్తుంది.
టాపిక్