తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆధార్‌ కార్డు కాపీలు ఎవరికి ఇవ్వొద్దు.....

ఆధార్‌ కార్డు కాపీలు ఎవరికి ఇవ్వొద్దు.....

HT Telugu Desk HT Telugu

29 May 2022, 11:54 IST

google News
    • ధృవీకరణ పత్రాలుగా ఆధార్‌ కార్డుల్ని ఎవరికి ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు ఆధార్‌ కార్డు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఎక్కువవడంతో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఆధార్ నకళ్లు, ఫోటోలు కోరడం చట్టవిరుద్ధమని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఆధార్ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని పౌరులకు కేంద్రం సూచించింది
ఆధార్ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని పౌరులకు కేంద్రం సూచించింది (HT_PRINT)

ఆధార్ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని పౌరులకు కేంద్రం సూచించింది

ఆధార్‌ కార్డు, విశిష్ట గుర్తింపు సంఖ్యల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ లావాదేవీలు నడుస్తున్న వేళ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరికి పడితే వారికి ఆధార్ కార్డును కోరే అధికారం లేదని తేల్చి చెప్పింది. ఆధార్‌ సమాచారం దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు ఉన్న ఆధార్‌ కార్డును బయటి వారికి ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాలకు ఆధార్‌ కార్డులు కీలకంగా మారుతున్నాయి. విదేశాలకు ఆధార్ కార్డ్ మార్ఫింగ్ చేసి విదేశాలకు డ్రగ్స్‌ కొరియర్‌ చేసిన ఉదంతం కూడా విజయవాడలో వెలుగు చూసింది.

 ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తుండటంతో అక్రమాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆధార్‌ కార్డు ఫోటో కాపీని ఎవరికి ఇవ్వొద్దని కేంద్రం సూచించింది. ఎదైనా సందర్భంలో ఆధార్‌ కార్డుని ఇవ్వాల్సి వస్తే చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉండే కాపీలను ఇవ్వాలని సూచించింది. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేలా ఉన్న కార్డుల్ని వినియోగించాలని సూచించింది. ఇలాంటి ఆధార్‌ కార్డుల్ని యూఐడిఏఐ అధికారిక వెబ్‌సైట్‌ https://myadhaar.uidai.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో మాస్క్‌ చేసిన ఆధార్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. వీటిని మాత్రమే బహిరంగ వినియోగానికి వాడాలని కేంద్రం సూచించింది.

ఆధార్‌ కార్డును ధృవీకరించుకోడానికి వెబ్‌సైట్‌లో వెరిఫై చేసుకునే సదుపాయం కూడా ఉందని, అనధికారిక వినియోగాన్ని నిరోధించేందుకు ఈ సదుపాయలు వాడుకోవాలని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆఫ్‌లైన్‌లో ఆధార్‌ కార్డు ధృవీకరణ కోసం కార్డు మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్ యాప్‌లో స్కాన్‌ చేసి ధృవీకరించవచ్చని ప్రకటించారు. ఇంటర్నెట్ కేంద్రాలు, పబ్లిక్‌ కియోస్క్‌లలో ఆధార్ కార్డుల్ని డౌన్‌ లోడ్ చేయొద్దని కేంద్రం సూచించింది.

 అత్యవసర సమయాల్లో బయట ప్రదేశాల్లో డౌన్‌లోడ్ చేసినా వెంటనే వాటిని డిలీట్ చేయాల్సిందిగా సూచించారు. కేంద్ర ప్రభుత్వం, యూఐడిఏఐల నుంచి అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే ఆధార్ కార్డుల ధృవీకరించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. హోటళ్లు, సినిమా హాళ్లు ఇతర ప్రదేశాల్లో ఆధార్ కార్డుల్ని సేకరించడం, వాటి కాపీలను భద్రపరచడం చట్టవిరుద్ధమని కేంద్రం పేర్కొంది. అలా చేసే వారిపై ఆధార్ చట్టం 2016కింద కేసులు నమోదు చేయొచ్చని స్పష్టం చేసింది. ప్రైవేట్ సంస్థలు ఆధార్ కార్డు కోసం డిమాండ్ చేస్తే వారిని యూఐడిఏఐ లైసెన్స్‌ చూపాల్సిందిగా పౌరులు కోరవచ్చని ప్రకటించింది.

టాపిక్

తదుపరి వ్యాసం