Electric Cars|విద్యుత్ కార్లలో గేర్ బాక్స్ ఉంటుందా? వేగాన్ని ఎలా నియంత్రిస్తారు?
02 March 2022, 7:28 IST
- సాధారణ వాహనాలకు, ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయితే ఈ విద్యుత్ కార్లలో గేర్ బాక్స్ ఉంటుందా అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. టెక్నికల్‌గా ఎలక్ట్రిక్ కార్లలో గేర్ బాక్స్ ఉంటుంది.. కానీ అది సాధారణ వాహనాల మాదిరిగా ఉండదు.
ఎలక్ట్రిక్ కార్లు
గతంతో పోలిస్తే కార్ల కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. ఓ పక్క ఇంధన ధరలు మండుతున్నప్పటికీ సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం వినియోగదారులు వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకూ(EV) రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతోంది. పర్యావరణ హితమైన ఈ కార్లపై వాహన ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఎలక్ట్రిక్, సాధారణ కార్లకు తేడా..
అసలు సాంప్రదాయ కార్లకు, ఎలక్ట్రిక్ వాహనాల మధ్య ఉన్న వ్యత్యాసాల్లో ఇది కూడా ఒకటి. కార్లలో ఉండే ఇంజిన్ మల్టీ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కానీ విద్యుత్ కార్లలో ఈ ఇంజిన్ ఉండదు. దీని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేసే సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి గేర్ మారే అవకాశమే లేదు. అవును మీరు విన్నది నిజమే.. గేర్ బాక్స్ అవసరం లేదు. మరి గేర్ బాక్స్ లేకపోతే విద్యుత్ కార్లలో ఎలా కదులుతాయనేగా మీ ప్రశ్న. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల మాదిరిగా ఎలక్ట్రిక్ కార్లలో మల్టీ స్పీడ్-ట్రాన్స్‌మిషన్స్ అవసరం లేదు.
ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు డ్రైవింగ్ కండీషన్ల ఆధారంగా టార్క్, వేగాన్ని నియంత్రించడానికి వివిధ రకాల రేషియోలతో కూడిన గేర్లతో పనిచేస్తాయి. విద్యుత్ మోటార్లలో ఇలా ఉండదు. ఇక్కడ అదే మొత్తంలో టార్క్ ఉత్పత్తి అవుతుంది. సాధ్యమైనంత గరిష్ఠంగా ఆర్పీఎం పరిధిలో సమానంగా ఉంటుంది. అంటే ఆర్పీఎంకు సమానంగా టార్క్ అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా మోటార్ గరిష్ఠ టార్క్ కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి విద్యుత్ మోటార్లు తక్షణ శక్తిని అందిస్తాయి. అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో పునరుత్పత్తయ్యే టార్క్ ఇక్కడ మ్యూట్‌గా ఉంటుంది.
ఎలక్ట్రిక్ మోటార్ ఆర్పీఎం..
ఎలక్ట్రిక్ మోటార్ రెవ్ రేంజ్(Rev range) కూడా చాలా విస్తృతంగా ఉంటుంది. 10 వేల ఆర్పీఎం వరకు సులభంగా స్పిన్ చేయగలదు. ప్రస్తుతం విద్యుత్ మోటార్లు అలాంటి విస్తృత ఆర్పీఎం పరిధిలో స్థిరమైన టార్క్ ను అందిస్తున్నాయి. సగటు ఐసీ ఇంజిన్ తో పోలిస్తే 6000 నుంచి 7000 ఆర్పీఎం వరకు ఉంటుంది.
ఎలక్ట్రిక్ కారులో మల్టీ స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చడం కూడా సంక్లిష్టం. అంతేకాకుండా ఇది ఎవరికీ ప్రయోజనం లేకుండా చేస్తుంది. అందువల్ల విస్తృత ఆర్పీఎం రేంజ్ ఆపరేషన్ కోసం ఒకే గేర్ రేషియో సరిపోతుంది.