Afghan women: ‘విడాకులు తీసుకున్నా.. బలవంతంగా మళ్లీ భర్త వద్దకు..’
08 March 2023, 9:33 IST
- Afghan women: అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై మధ్య యుగాల నాటి ఆంక్షలతో నరకం చూపుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
Afghan women: మార్వ.. ఆఫ్గనిస్తాన్ కు చెందిన మహిళ. పెళ్ళైన నాటి నుంచే భర్త చిత్ర హింసలు ప్రారంభించాడు. భర్త చేతిలో దెబ్బలు తినని రోజు లేదు. పిల్లలు పుట్టినా వేధింపులు ఆగలేదు.. సరికదా మరింత పెరిగాయి. భర్త దెబ్బలకు ఆమె పళ్లు మొత్తం ఊడిపోయాయి. జుట్టు పట్టుకుని లాగడంతో, కుదుళ్ల నుంచి జుట్టు ఊడిపోయిన పరిస్థితి. దెబ్బలకు తట్టుకోలేక స్పృహ లేకుండా పడి ఉన్న రాత్రులెన్నో. ఈ వేధింపుల మధ్యలోనే ఆరుగురు ఆడపిల్లలకు, ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఇక ఈ బాధలు తట్టుకోలేక గత పాలకుల పాలనలో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. విడాకులు మంజూరయ్యాయి. పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది.
TALIBAN RULE: తాలిబన్ పాలనలో..
2021లో మళ్లీ తాలిబన్ల పాలన ప్రారంభమైంది. మహిళలపై ఆంక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మార్వ విడాకులు తీసుకున్న భర్త తాలిబన్ కమాండర్లను ఆశ్రయించాడు. బలవంతంగా తనతో విడాకులు ఇప్పించారని, తన భార్యను మళ్లీ తన వద్దకు పంపించాలని కోరాడు. దాంతో, తాలిబన్ కమాండర్లు మళ్లీ భర్త వద్దకు వెళ్లాలని మార్వను ఆదేశించారు. విడాకుల కాగితాలను చింపేశారు. వారి ఆదేశాలను కాదంటే, ప్రాణాలే పోయే పరిస్థితి. తప్పని సరై ఏడుస్తూ, పిల్లలతో పాటు మళ్లీ భర్త ఇంటికి, ఆ చిత్రహింసల జీవితానికి మళ్లీ వెళ్లింది. ఇది ఒక్క మార్వ కథ కాదు. వేధింపులు, భర్త చేతిలో దెబ్బలు, తట్టుకోలేని గాయాలు మళ్లీ మొదలు.
Afghan women woes: ఆంక్షల ఆఫ్గాన్..
ఇలా భర్త, ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక వేరుగా, స్వతంత్రంగా ఉంటున్న వేలాది అఫ్గానీ మహిళల కథ. తాలిబన్ల కొత్త నియమాల ప్రకారం.. విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న మహిళలంతా మళ్లీ తమ భర్త వద్దకు వెళ్లాలి. ఎలాంటి కారణాలు చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుత తాలిబన్ల పాలనలో మహిళలకు ఎలాంటి హక్కులు లేవు. వారిపై తాలిబన్లు విధిస్తున్న ఆంక్షలకు అంతు లేదు. వారిపై మగ కుటుంబ సభ్యుల వేధింపులకు ముగింపు లేదు. అఫ్గానిస్తాన్ ప్రతీ 10 మంది మహిళల్లో 9 మంది భర్త చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చింది. ధైర్యం చేసి విడాకులు తీసుకున్న మహిళలకు తాలిబన్ పాలకుల నుంచే కాకుండా, సమాజం నుంచి కూడా సరైన మద్దతు, సహాయం అందడం లేదు.