Denying sex is cruelty: ‘జీవిత భాగస్వామితో సెక్స్ కు నిరాకరించడం క్రూరత్వమే’: అలహాబాద్ హైకోర్టు
25 May 2023, 19:38 IST
- Denying sex is cruelty: సరైన కారణం చూపకుండా, దీర్ఘకాలం పాటు జీవిత భాగస్వామితో లైంగిక చర్యకు నిరాకరించడం మానసికంగా హింసించడంగా, క్రూరత్వంగా పరిగణించవచ్చని అలహాబాద్ హై కోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాతిపదికన విడాకులు మంజూరు చేయవచ్చని సూచించింది.
ప్రతీకాత్మక చిత్రం
Denying sex is cruelty: సరైన కారణం చూపకుండా, దీర్ఘకాలం పాటు జీవిత భాగస్వామితో లైంగిక చర్యకు నిరాకరించడం మానసికంగా హింసించడంగా, క్రూరత్వంగా పరిగణించవచ్చని అలహాబాద్ హై కోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాతిపదికన విడాకులు మంజూరు చేయవచ్చని సూచించింది.
Allahabad High Court grants divorce: విడాకులు మంజూరు
తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించిన ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య కొన్నేళ్లుగా తనతో దూరంగా ఉంటోందని, పెళ్లైన నాటి నుంచి తన దగ్గర లేదని, ఆమె తీరును మానసిక హింసగా పరిగణించి తనకు విడాకులు మంజూరు చేయాలన్న తన అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చిందని ఆ వ్యక్తి హై కోర్టుకు వివరించాడు. కేసును విచారించిన జస్టిస్ సునీల్ కుమార్, జస్టిస్ రాజేంద్ర కుమార్ ధర్మాసనం.. ఆ వ్యక్తి వాదనతో ఏకీభవించింది. చాలా కాలం పాటు, సరైన కారణం చూపకుండా జీవిత భాగస్వామితో లైంగిక చర్యకు నిరాకరించడం మానసికంగా హింసించడమేనని, అది మానసిక క్రూరత్వంగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. ఆ ప్రాతిపదికన ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది.
1979 లో వివాహం..
కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. ఆ వ్యక్తికి 1979 లో వివాహమైంది. ఆ తరువాత కూడా ఆయన భార్య కాపురానికి రాలేదు. కొంత కాలం తరువాత పెద్దలతో మాట్లాడి, ఆమెను కాపురానికి తీసుకువచ్చాడు. కానీ, అప్పుడు కూడా ఆమె భర్తతో శృంగారానికి అనుమతించలేదు. కొన్ని రోజులకు మళ్లీ పుట్టింటికి వెళ్లింది. కొన్ని సంవత్సరాల తరువాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దాంతో, ఇరుకుటుంబాల పెద్దలు స్థానిక పెద్ద మనుషుల వద్ద వీరిద్దరికి విడాకులు ఇప్పించారు. అనంతరం, చట్టబద్ధంగా విడాకులు కావాలని కోరుతూ ఆ వ్యక్తి స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తనను మానసికంగా హింసించిన తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని ఆయన కోర్టును కోరారు. కానీ, ఫ్యామిలీ కోర్టు ఆయన వాదనను తోసిపుచ్చి, విడాకులు మంజూరు చేయడానికి అంగీకరించలేదు. దాంతో, అతడు అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించి, విజయం సాధించాడు.