తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Summons To Brij Bhushan: రెజ్లర్లపై వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు కోర్టు సమన్లు

Summons to Brij Bhushan: రెజ్లర్లపై వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు కోర్టు సమన్లు

HT Telugu Desk HT Telugu

07 July 2023, 18:45 IST

google News
  • Summons to Brij Bhushan: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది.

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్

Summons to Brij Bhushan: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) కు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది.

జులై 18 న హాజరుకావాలి..

బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పలువురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చాలా రోజులుగా నిరసన తెలియజేశారు. వివిధ రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు వారికి మద్ధతుగా నిలిచాయి. ఒత్తడి పెరగడంతో ఢిల్లీ పోలీసులు రెజ్లర్ల ఫిర్యాదును స్వీకరించి, బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. బ్రిజ్ భూషణ్ పై ఆరోపణలకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం, జులై 18వ తేదీన కోర్టుకు స్వయంగా హాజరు కావాలని బ్రిజ్ భూషణ్ సింగ్ ను అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఆదేశించారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ అడిషనల్ సెక్రటరీపై కూడా..

రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ పై ఐపీసీ లోని 354, 354 డీ, 345ఏ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్ ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. బ్రిజ్ భూషణ్ తో పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య అదనపు సెక్రటరీ వినోద్ తోమర్ ను కూడా జులై 18న కోర్టుకు హాజరుకావాలని రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అతనిపై నేరానికి సహకరించిన, బాధితులను బెదిరించిన ఆరోపణలున్నాయి. బ్రిజ్ భూషణ్ పై పొక్సొ (POCSO) చట్టం కింద కూడా ఫిర్యాదు వచ్చింది. ఒక మైనర్ రెజ్లర్ తరఫున ఆమె తండ్రి ఈ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫిర్యాదును వారు ఆ తరువాత ఉపసంహరించుకున్నారు. బ్రిజ్ భూషణ్ పై ఫిర్యాదు చేసిన వారిలో ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫొగట్ తదితరులున్నారు.

తదుపరి వ్యాసం