ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజాల్ రాజీనామా
18 May 2022, 22:23 IST
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ బుధవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు.
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్
ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)గా అనిల్ బైజాల్ 2016 డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. నజీబ్ జంగ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ బైజాల్ ఆ బాధ్యతలను చేపట్టారు. ఢిల్లీలో ఎల్జీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో అనిల్ బైజాల్ పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీతో, ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఎల్జీ అనిల్ బైజాల్‌కి ఎన్నడూ సత్సంబంధాలు లేవు. ప్రభుత్వానికి, ఎల్జీకి విబేధాలు తీవ్రమైన దశలో.. ఈ రెండు అధికార కేంద్రాల హక్కులు, బాధ్యతలను 2018లో సుప్రీంకోర్టు సమగ్రంగా వివరించింది. `ఎల్జీకి ప్రత్యేకమైన అధికారాలు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. ఆ అధికారాలు ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయి` అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
1969 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్
అనిల్ బైజాల్ 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా హోం శాఖ సెక్రటరీగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ. 60 వేల కోట్ల విలువైన `జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్(జేఎన్ఎన్‌యూఆర్ఎం)` కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఢిల్లీలో ఎల్జీగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో తరచూ విబేధాలు పొడచూపేవి. అనిల్ బైజాల్ ఎల్జీగా తన అధికార పరిధిలో కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేవారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలను వీటో చేసేవారు. దాంతో మళ్లీ ఎల్జీ, సీఎంల మధ్య మరో వివాదం ప్రారంభమయ్యేది.
టాపిక్