‘No to Dahi’: ‘‘హిందీ ‘దహీ’ ని మాపై బలవంతంగా రుద్దొద్దు’’- దక్షిణాది రాష్ట్రాలు
30 March 2023, 20:44 IST
‘No to Dahi’: హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా రుద్దుతోందన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పెరుగు ప్యాకెట్లపై కచ్చితంగా ‘దహీ (dahi)’ అని హిందీ లో స్పష్టంగా ముద్రించాలన్న FSSAI నిబంధనలను తమిళనాడు తిప్పికొట్టింది.
ప్రతీకాత్మక చిత్రం
‘No to Dahi’:అన్ని పెరుగు ప్యాకెట్లపై కచ్చితంగా ‘దహీ (dahi)’ అని హిందీ లో స్పష్టంగా ముద్రించాలని ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనలపై దక్షిణాది రాష్టమైన తమిళనాడు మండిపడింది. హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడంలో భాగంగానే ఈ నిబంధనలు జారీ చేశారని విమర్శించింది.
‘No to Dahi’: తమిళంలోనే రాస్తాం..
ఈనేపథ్యంలో తమిళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఆవిన్ (Aavin) తమ పెరుగు ఉత్పత్తులపై హిందీలో దహీ (dahi) అని ముద్రించబోమని, తమిళంలో స్పష్టంగా తాయిర్ (tayir) అని ముద్రిస్తామని స్పష్టం చేసింది. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక లోని నందిని సంస్థ మాత్రం తమ పెరుగు ప్యాకెట్లపై దహీ (dahi) అని ముద్రించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయంపై కర్నాటకలోని విపక్ష పార్టీలు మండిపడ్తున్నాయి. కన్నడ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని మాజీ సీఎం, జేడీఎస్ (JDS) నేత కుమార స్వామి విమర్శించారు.
FSSAI rolls back its directions: వెనక్కు తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
పెరుగు ప్యాకెట్లపై దహీ (dahi) అని ముద్రించాలని ఆదేశించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రేనని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆరోపించారు. ఆగస్ట్ లోపు అన్ని పెరుగు ప్యాకెట్లపై దహీ అని హిందీలో ముద్రించాలని తమకు FSSAI నుంచి ఆదేశాలు వచ్చాయని తమిళనాడు డైరీ డెవలప్ మెంట్ మంత్రి ఎస్ఎం నాసర్ వెల్లడించారు. అయితే, ఆ ఆదేశాలను తాము పాటించబోవడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని బీజేపీ (BJP) నాయకులు కూడా FSSAI ఆదేశాలను తప్పుబట్టడం విశేషం. ఈ నేపథ్యంలో అన్ని పెరుగు ప్యాకెట్లపై దహీ అని హిందీలో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలన్న తమ ఆదేశాలను FSSAI వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.