CTET Result 2024: మార్కుల షీట్, పాస్ సర్టిఫికేట్‌పై సీబీఎస్ఈ కీలక ప్రకటన
22 January 2024, 11:20 IST
- సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ డిజిలాకర్ ఖాతాలను బోర్డు క్రియేట్ చేస్తుంది. వారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు లాగిన్ క్రెడెన్షియల్స్ అందుకుంటారు.
CTET Result 2024: మార్క్స్ షీట్, ఉత్తీర్ణ సర్టిఫికెట్‌పై సీబీఎస్ఈ కీలక ప్రకటన
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి 2024 పరీక్ష మార్కుల షీట్లు, సర్టిఫికెట్లను డిజిలాకర్ ద్వారా అందించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారం ప్రకటించింది.
పరీక్షకు హాజరైన అభ్యర్థులందరి డిజిలాకర్ ఖాతాలను బోర్డు క్రియేట్ చేస్తుంది. వారు సీబీఎస్‌ఈలో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లకు లాగిన్ క్రెడెన్షియల్స్ (యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వివరాలు) అందుకుంటారు.
ఇది 'గ్రీన్ ఇనిషియేటివ్' దిశగా తమ సంకల్పమని బోర్డు తెలిపింది. భారీ మొత్తంలో డబ్బు, పేపర్, చెట్లు, నీరు వంటి విలువైన వనరులను ఆదా చేయడానికి, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బోర్డు కట్టుబడి ఉందని సీబీఎస్ఈ తెలిపింది.
మార్క్ షీట్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ డిజిటల్ ఫార్మాట్ లో అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని, వాటిని ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ రూపంలో ఎక్కడైనా పంచుకోవచ్చని తెలిపింది.
మార్స్ షీట్లు, సర్టిఫికెట్ల భద్రతను పెంపొందించడానికి, సీబీఎస్ఈ ఈ డాక్యుమెంట్లలో ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్లను పొందుపరుస్తుంది. డిజిలాకర్ మొబైల్ యాప్ ఉపయోగించి స్కాన్ చేసి ధృవీకరించవచ్చు.
డిజిటల్ సంతకం చేసిన ఈ పత్రాలు ఐటీ చట్టం ప్రకారం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని సీబీఎస్ఈ తెలిపింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ జనవరి 2024) 18వ ఎడిషన్ జనవరి 21న దేశవ్యాప్తంగా 135 నగరాల్లోని 3,418 పరీక్షా కేంద్రాల్లో జరిగింది.
రెండు పేపర్లకు కలిపి మొత్తం 26,93,526 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 84 శాతం హాజరు నమోదైంది.
మొత్తం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల్లో 9,58,193 మంది పేపర్ 1 (1-5 తరగతులు), 17,35,333 మంది పేపర్ 2 (6 నుంచి 8 తరగతులు) కోసం హాజరయ్యారని సీబీఎస్ఈ తెలిపింది.
అనంతరం పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీతో పాటు ఓఎంఆర్ షీట్ల స్కాన్ చేసిన చిత్రాలను బోర్డు విడుదల చేయనుంది. ప్రతి ప్రశ్నకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానిస్తారు. మరిన్ని వివరాలకు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in లో చూడవచ్చు.