Covid variant JN.1: వేగంగా వ్యాపిస్తున్న కొరొనా కొత్త వేరియంట్; పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
29 December 2023, 17:47 IST
- కోవిడ్ 19 ముప్పు మళ్లీ తరుముకు వస్తోంది. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ నుంచి పిల్లలను కాపాడడానికి జాగ్రత్తలు తప్పని సరి.
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ లో కూడా గత 24 గంటల్లో 150 కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల గుర్తించిన వేరియంట్లలో అత్యంత వేగంగా సోకే ముప్పు ఈ వేరియంట్ కు ఉంది. ప్రస్తుతం ఉన్న టీకాలు ఈ కొత్త ఉప-వేరియంట్ నుండి పూర్తి రక్షణను అందిస్తాయో లేదో స్పష్టంగా తెలియదు.
పిల్లల విషయంలో జాగ్రత్త..
తల్లిదండ్రులు పిల్లలకు ఈ వైరస్ గురించి అవగాహన కల్పించాలి. దాని వ్యాప్తిని నిరోధించే జాగ్రత్తలను వివరించాలి. కోవిడ్ ప్రొటోకాల్ ను వారికి వివరించి, వారు ఆ ప్రొటోకాల్ పాటించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి. పిల్లలను కొరోనా నుంచి కాపాడడానికి ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
- పిల్లలు పరిశుభ్రత పాటించేలా చూసుకోవాలి. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. ముఖం, ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోరు.. లను తరచుగా శుభ్రం చేసుకోవాలి.
- పిల్లలు సమతుల ఆహారం తీసుకునేలా చూడాలి. వారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవ్వాలి. ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే, పిల్లలకు రోజు కొద్దిసేపు ఆటలు, లేదా శారీరక వ్యాయామం అలవాటు చేయాలి. రోప్ జంపింగ్, రన్నింగ్ వంటి చిన్న చిన్న ఆటలైనా ఆడిపించాలి. ఆటలు, శారీరక వ్యాయామంతో వారిలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఎండార్ఫిన్‌లు విడుదల అవుతాయి.
- రద్దీగా ఉండే ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లను కచ్చితంగా ఉపయోగించేలా చూసుకోవాలి. ఇవి కొరోనా వైరస్ ను అడ్డుకోవడమే కాదు.. శరీరం కాలుష్యం బారిన పడకుండా చూస్తాయి. నాణ్యమైన మాస్క్ లను వాడాలి. డిస్పోసబుల్ మాస్క్ లను ఒకసారి కన్నా ఎక్కువ సార్లు వాడకూడదు.
- పిల్లలు భౌతిక దూరం.. ఫిజికల్ డిస్టాన్స్ పాటించేలా చూడాలి. బహిరంగ ప్రదేశాలలో ఇతరుల నుండి సురక్షితమైన దూరంలో ఉండాలని నేర్పించాలి. దగ్గరకు వెళ్లి మాట్లాడడం, కౌగిలించుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పాలి.
- బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలలో పిల్లలు ఆడుకునే లేదా నేర్చుకునే వీలు కల్పించాలి. దీనివల్ల వైరస్ గాలి ద్వారా వ్యాపించే ప్రమాదం తగ్గుతుంది. ఇంటి లోపల కూడా కిటికీలు లేదా తలుపులు తెరిచి ఉంచాలి.
- కొరోనాను నివారించడంలో వ్యాక్సీన్ ది కీలక భూమిక. డాక్టర్ ను సంప్రదించి, టీకా ఇప్పించే ఏర్పాటు చేయండి.
- సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలకు, కొవిడ్ 19 కు ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. అందువల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.