తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Coromandel Express Accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 50 మంది మృతి; 300 మందికి పైగా తీవ్ర గాయాలు

Coromandel Express accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 50 మంది మృతి; 300 మందికి పైగా తీవ్ర గాయాలు

HT Telugu Desk HT Telugu

02 June 2023, 23:00 IST

google News
    • పశ్చిమబెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైంది. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. 
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు (ANI)

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద దృశ్యాలు

పశ్చిమబెంగాల్ లోని షాలిమార్ నుంచి చెన్నై వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఒడిశాలో ఘోర ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అనంతరం, వేరే లైన్ లో వస్తున్న మరో ఎక్స్ ప్రెస్ రైలును ఢీ కొన్నది. ఈ ఘోర ప్రమాదంలో 50 మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పి, ఎదురుగా వస్తున్న బెంగళూరు - హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (Bengaluru -Howrah superfast express) రైలును ఢీకొన్నాయని, ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయారని ఖరగ్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ ట్వీట్ చేశారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన సుమారు 12 బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయని వివరించారు. నాలుగు బోగీలు చాలా దూరం వరకు దూసుకుపోయాయన్నారు.

సాయంత్రం 7 గంటల సమయంలో

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు షాలిమార్ స్టేషన్ నుంచి చెన్నైకి మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో బయల్దేరిందని, బాలాసోర్ స్టేషన్ కు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చేరకుందని అధికారులు తెలిపారు. సుమారు 7 గంటల సమయంలో బహనాగ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిందని వివరించారు.

క్షతగాత్రులకు చికిత్స

ఈ రైలు ప్రమాదంలో సుమారు 50 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే, 300 మందికి పైగా గాయపడ్డారని, పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం కోసం 60 అంబులెన్స్ లు పని చేస్తున్నాయన్నారు. బాధితుల బంధువులు, ఇతర ప్రయాణికుల కోసం 06782-262286 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు. అలాగే, వివజయవాడ స్టేషన్ కు సంబంధించి 0866 2576924, రైల్వే 67055 హెల్ప్ లైన్ నంబర్ ను, రాజమండ్రి స్టేషన్ కు సంబంధించి 08832420541 రైల్వే 65395 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేశారు.

తదుపరి వ్యాసం