Shashi Tharoor: శశిథరూర్ ఎన్‍సీపీలో చేరతారా? ఆయన ఏమన్నారంటే..
05 December 2022, 22:54 IST
- Shashi Tharoor: ఎన్‍సీపీ నేత చాకో తనను ఆ పార్టీకి ఆహ్వానించడంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ స్పందించారు. కేరళ కాంగ్రెస్‍లో లుకలుకలు మొదలైన తరుణంలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
Shashi Tharoor: శశిథరూర్ ఎన్‍సీపీలో చేరతారా? ఆయన ఏమన్నారంటే..
Shashi Tharoor On NCP Invitation: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కేరళ అధ్యక్షుడు పీసీ చాకో (PC Chacko) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కేరళ కాంగ్రెస్‍లో విభేదాలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాకో వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అయితే ఈ విషయంపై శశి థరూర్ స్పందించారు.
అలాంటి చర్చ జరగలేదు
Shashi Tharoor: ఎన్‍సీపీ తనను ఆహ్వానించటంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్పందించారు. పీసీ చాకోతో తాను ఈ విషయం గురించి చర్చించలేదని అన్నారు. “ఒకవేళ నేను అక్కడికి వెళ్లాలనుకుంటే స్వాగతం అవసరం. నేను ఎన్‍సీపీకి వెళ్లడం లేదు. పీసీ చాకోతో అలాంటి విషయాన్ని చర్చించలేదు” అని మీడియాతో శశిథరూర్ సోమవారం అన్నారు. తాను ఎన్‍సీపీ వైపు చూస్తున్నానన్న విషయాన్ని ఖండించారు.
‘థరూర్… ఒకే ఒక్కడు’
శశి థరూర్‌ను కాంగ్రెస్ ఎందుకు విస్మరిస్తోందో తనకు తెలియడం లేదని ఎన్‍సీపీ కేరళ అధ్యక్షుడు పీసీ చాకో అన్నారు. “ఒకవేళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎన్‍సీపీకి వస్తే.. మేం సంతోషంగా ఆహ్వానిస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తిరస్కరించినా.. తిరువనంతపురం ఎంపీగా థరూర్ ఉంటారు. థరూర్‌ను కాంగ్రెస్ ఎందుకు విస్మరిస్తోందో నాకు తెలియడం లేదు” అని చాకో చెప్పారు. బీజేపీకి సవాల్ విసిరే సామర్థ్యమున్న కాంగ్రెస్ నాయకుడు థరూర్ మాత్రమేనని చాకో అభిప్రాయపడ్డారు.
“బీజేపీకి చాలెంజ్‍లు విసిరే సామర్థ్యమున్న ఒకేఒక్క కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్. విజిన్‍జమ్ పోర్టు నిర్మాణంపై శశి థరూర్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కేరళలోని మరే ఇతర కాంగ్రెస్ నాయకుడైనా చెప్పగలిగారా.! థరూర్.. రాజకీయ పరిణతికి ఇదే ఉదాహరణ” అని చాకో అన్నారు.
థరూర్.. సీఎం అభ్యర్థి కావాలనుకుంటున్నారా?
కేరళ కాంగ్రెస్‍లో ముసలం మొదలైందని సమాచారం. 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండాలని శశి థరూర్ భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన సమావేశాల్లో ఇటీవల థరూర్ ఎక్కువగా పాల్గొంటున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాల్లోనూ యాక్టివ్‍గా ఉంటున్నారు. దీంతో కొందరు కేరళ కాంగ్రెస్ నాయకుల్లో అభద్రతా భావం ఎక్కువైందని సమాచారం. మలబార్ ప్రాంతంలో థరూర్ ఇటీవల పర్యటించగా.. అప్పటి నుంచే విభేదాలు మొదలయ్యాయి. రాష్ట్ర రాజకీయాలపై థరూర్ ఎక్కువగా దృష్టి సారించడం పార్టీలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే ఆయనకు ప్రత్యర్థి వర్గం కూడా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కూడా శశి థరూర్ పోటీ చేశారు. అయితే మల్లికార్జున ఖర్గే.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో కేరళ రాష్ట్రంపై ఎక్కువ ఫోకస్ చేయాలని థరూర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.