`రెండు సార్లకు మించి రాజ్యసభ సభ్యుడయ్యే ఛాన్స్ ఉండదు`
14 May 2022, 15:27 IST
ఉదయపూర్‌లో జరుగుతున్న `చింతన్ శిబిర్` లో కాంగ్రెస్ పలు నూతన నిర్ణయాలకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన పార్టీ.. రాజ్యసభ సభ్యత్వం కూడా రెండు పర్యాయాలకే పరిమితం చేయాలని యోచిస్తోంది.
`చింతన్ శిబిర్`లో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ
రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ మేథో మథన సదస్సు నవ కల్పన చింతన్ శిబిర్ శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలు విప్లవాత్మక ప్రతిపాదనలపై ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అందులో ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్న ప్రతపాదనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించగా, తాజాగా ఒక నాయకుడికి రెండు పర్యాయాలు మాత్రమే రాజ్యసభ సభ్యత్వానికి అవకాశం కల్పించాలన్నప్రతిపాదనను మెజారిటీ నాయకులు ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం.. రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన వ్యక్తి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం పొందలేడు. కానీ లోక్‌సభకు కానీ, రాష్ట్ర అసెంబ్లీకి కానీ పోటీ చేయవచ్చు. అలాగే, బ్లాక్, జిల్లా స్థాయి నుంచి ఏఐసీసీ వరకు ఆఫీస్ బేర్లర్లందరికి కూడా ఐదు ఏళ్ల కచ్చిత కాలపరిమితి విధించాలని కూడా ఆలోచిస్తున్నారు. 5 ఏళ్లు పూర్తి కాగానే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
పీసీసీలకు సొంత కాన్‌స్టిట్యూషన్
రాష్ట్రాలు సొంతంగా అవసరమైన మేరకు నియమ నిబంధనలతో సొంతంగా కాన్‌స్టిట్యూషన్‌ను రూపొందించుకునే వెసులుబాటును కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఆ రాజ్యాంగానికి కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆమోదం తప్పని సరి. `ప్రతీ రాష్ట్రంలో వేర్వేరు పరిస్థితులుంటాయి. అన్నింటినీ ఒకే గాటన కట్టలేం. ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు రాష్ట్రాల పీసీసీలకు సొంత కాన్‌స్టిట్యూషన్ ఉండడం అవసరం. స్టేట్ స్పెసిఫిక్ కాన్‌స్టిట్యూషన్ అనే భావన ఇప్పటికే కాంగ్రెస్ కాన్‌స్టిట్యూషన్లో ఉంది` అని సీడబ్ల్యూసీ సభ్యుడైన పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
రాష్ట్రాలకు మరో మూడేళ్లు జీఎస్టీ పరిహారం ఇవ్వాలి
దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం వచ్చిందన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఆర్థిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పొడగించాలన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ డిమాండ్ చేస్తున్నాయన్నారు. చింతన్ శిబిర్‌లో ఆర్థిక వ్యవహారాలను చర్చించే బృందానికి చిదంబరం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా దేశాన్ని ప్రస్తుత ప్రభుత్వం అధఃపాతాళానికి తీసుకువెళ్లిందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయన్నారు. ఈ ప్రభావం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతోందన్నారు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో కూడా తెలియని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు.
కాంగ్రెస్ ఘనత
1991లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం అనూహ్య పురోగతిని సాధించిందని చిదంబరం తెలిపారు. పదేళ్ల వ్యవధిలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందని వివరించారు. సంపద సృష్టిలో, కొత్త ఉద్యోగ, వ్యాపారాల కల్పనలో రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన సంస్కరణల మూలంగా ఆర్థికంగా బలమైన కొత్త మధ్య తరగతి వర్గం ఏర్పడిందని వివరించారు. కాంగ్రెస్ కృషిని బీజేపీ ప్రభుత్వం బూడిదలో పోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పోస్ట్- లిబరలైజేషన్ పాలసీలను రూపొందించాల్సి ఉందన్నారు.
టాపిక్