లోక్‌సభ 2024: కాంగ్రెస్‌లో పొలిటికల్ అఫైర్స్ సహా మూడు బృందాల ఏర్పాటు
24 May 2022, 13:26 IST
- న్యూఢిల్లీ: భవిష్యత్తు రోడ్ మ్యాప్ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం మూడు బృందాలను ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ
ముఖ్యమైన రాజకీయ వ్యవహారాలపై మార్గదర్శనానికి ఒక బృందాన్ని, ఉదయ్‌పూర్ నవసంకల్ప్ డిక్లరేషన్ అమలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్-2024 పేరుతో మరొక బృందాన్ని, అలాగే అక్టోబరు 2న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర కోఆర్డినేషన్ కోసం మరొక బృందాన్ని ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ, గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ పొలిటికల్ అఫైర్స్ గ్రూపులో ఉన్నారు. అలాగే మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా టాస్క్‌ఫోర్స్-2024 బృందంలో ఉంటారు.
పార్టీ సంస్థాగత మరమ్మతులను డిమాండ్ చేస్తున్న 23 మంది నేతల్లో (అసమ్మతి నేతల బృందం) గులామ్ నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఉన్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు గాంధీ జయంతిన ప్రారంభం కానున్న భారత్ జోడో యాత్రను సమన్వయం చేసేందుకు కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.
‘ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్ శిబిర్ అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు పొలిటికల్ అఫైర్స్ గ్రూప్ ఏర్పాటు చేశారు. దీనికి సోనియాగాంధీ అధ్యక్షత వహిస్తారు. అలాగే టాస్క్‌ఫోర్స్-2024ను, భారత్ జోడో యాత్ర సమన్వయం చేసేందుకు కేంద్ర ప్రణాళిక బృందాన్ని ఏర్పాటు చేశారు..’ అని పార్టీ అధికారిక ప్రకటన తెలియజేసింది.
సోనియా గాంధీ నేతృత్వంలోని పొలిటికల్ అఫైర్స్ గ్రూప్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులామ్ నబీ ఆజాద్, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్ ఉంటారు.
టాస్క్‌ఫోర్స్-2024 గ్రూపులో పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, సునిల్ కనుగోలు ఉన్నారు.
‘టాస్క్‌ఫోర్స్‌లోని ప్రతి సభ్యుడికి నిర్ధిష్ట టాస్క్ ఉంటుంది. సంస్థాగత వ్యవహారాలు, కమ్యూనికేషన్ అండ్ మీడియా, ప్రజల్లోకి చేరడం, ఆర్థిక యాజమాన్యం, ఎన్నికల యాజమాన్యం ఉంటాయి..’ అని ప్రకటన తెలిపింది.
‘వారు ప్రత్యేక కమిటీలు కలిగి ఉంటారు. ఆయా బృందాలను తర్వాత తెలియపరుస్తాం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను టాస్క్‌ఫోర్స్ బృందం అనుసరిస్తుంది..’ అని తెలిపింది.
'భారత్ జోడో యాత్ర' సమన్వయం కోసం సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్‌లో దిగ్విజయ సింగ్, సచిన్ పైలట్, శశి థరూర్, రవ్‌నీత్ సింగ్ బిట్టు, కేజే జార్జ్, జోతి మణి, ప్రద్యుత్ బోర్డోలోయ్, జితు పట్వారీ, సలీమ్ అహ్మద్ ఉన్నారు.
టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులందరూ, కాంగ్రెస్ అనుబంధ విభాగాల అధిపతులందరూ సెంట్రల్ గ్రూప్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని ప్రకటన పేర్కొంది.