తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఛత్తీస్‌‘గఢ్‌’ మళ్లీ హస్తగతమే.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సర్వే రిపోర్ట్

ఛత్తీస్‌‘గఢ్‌’ మళ్లీ హస్తగతమే.. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సర్వే రిపోర్ట్

HT Telugu Desk HT Telugu

01 November 2023, 17:13 IST

    • ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ‘ఛత్తీస్‌గఢ్‌ ఆత్మగౌరవం’ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు ఆ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తేచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో స్పష్టమవుతోంది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల క్షేత్రస్థాయి సర్వే రిపోర్ట్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల క్షేత్రస్థాయి సర్వే రిపోర్ట్ (PTI/HT)

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల క్షేత్రస్థాయి సర్వే రిపోర్ట్

‘ఛత్తీస్‌గఢ్‌’ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఛత్తీస్‌ అంటే 36. గఢ్‌ అంటే కోట. 36 కోటలు కలిగిన రాష్ట్రం అనే అర్థం వచ్చేలా ఆ పేరు ఏర్పడింది. గోండు రాజులు నిర్మించిన ఈ కోటల రాజ్యంలో అధికార పగ్గాల కోసం కాంగ్రెస్‌, బీజేపీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. 2024లో దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు నవంబర్‌లో జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ రెండు జాతీయ పార్టీలకు కీలకం కానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

40 శాతం అటవీ ప్రాంతాన్ని కలిగున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ‘ఛత్తీస్‌గఢ్‌ ఆత్మగౌరవం’ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు ఆ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తేచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వేలో స్పష్టమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 47% ఓట్లతో 55-60, బీజేపీ 42% ఓట్లతో 28-34, బీఎస్పీ 1-2 స్థానాలు పొందే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడయ్యింది.

మధ్యప్రదేశ్‌ నుండి విడిపోయి 2000 నవంబర్‌ 1న ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. 2003లో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్‌ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. ఆయన నిరాటంకంగా 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రికార్డు స్థాయిలో 68 స్థానాలు పొందింది. నాలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టుల ప్రభావం ఉండడంతో నవంబర్‌ 7, 17 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు జరపనున్నారు.

కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఎందుకు?

  1. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అనుకూల వాతావరణానికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌పై ప్రజల్లో సానుకూలత ఉండడమే.
  2. బీజేపీ జాతీయత, హిందుత్వ అజెండాకు ప్రత్యామ్నాయంగా ‘ఛత్తీస్‌గఢ్‌ ఆత్మ గౌరవం’ పేరుతో సీఎం భూపేష్‌ ఇస్తున్న ‘ఛత్తీస్‌గఢ్‌ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్‌’ నినాదాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
  3. ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప పైరి కి ధర్‌’’ ప్రవేశపెట్టడం వంటి సెంటిమెంట్‌ అంశాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడనున్నాయి.
  4. ‘‘రామవంగమన్‌ పాత్‌’ పేరిట శ్రీరాముడు వనవాసం చేసిన రాష్ట్ర పరిధిలోని 75 స్థానాలను గుర్తించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం, ‘‘బెన్‌ ములాఖత్‌’’ పేరుతో సీఎం పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి తోడ్పడనున్నాయి.
  5. ‘‘కహో దిల్‌ సే, కాంగ్రెస్‌ ఫిర్‌ సే’’, ‘భూపేష్‌ హై తో, భరోసా హై’’ వంటి నినాదాలు ప్రజలకు చేరువవుతున్నాయి.

కాంగ్రెస్ విశ్వాసం వీటిపైనే

కాంగ్రెస్‌ రైతు పథకాలపైనే భారీ ఆశలు పెట్టుకుంది. వ్యవసాయ కుర్మి కులానికి చెందిన సీఎం భూపేష్‌ రైతులు తనకు అండగా ఉంటారనే నమ్మకంతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీతో పాటు ధాన్యం సేకరణ, మద్దతు ధరపై ఇచ్చిన హామీలను భూపేశ్‌ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ‘రాజ్యంగ్‌ కిసాన్‌ నయా యోజన్‌’ పథకం కింద ప్రతి రైతు నుండి పంట సేకరణను 15 క్వింటాల్‌ నుండి 20 క్వింటాల్‌కు పెంచారు.

భూములు లేని రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. రైతు ప్రయోజనాల పథకాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 60కు పైగా స్థానాలలో సులభంగా గెలుస్తామనే నమ్మకంతో కాంగ్రెస్‌ ఉంది.

వీధులలో సంచరించే ఆవుల కోసం ‘గోథాన్‌ యోజన’ పేరిట పథకాన్ని ప్రారంభించి గ్రామీణ యువతకు, మహిళలకు ఉపాధిని కలిగించడం పట్ల ప్రజలు ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉన్నారు. ఆవు పేడను ప్రభుత్వం రైతులు సేకరించి దాన్ని మహిళా స్వయం సహాయక కేంద్రాలలో వివిధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించేలా ప్రభుత్వం ప్రోత్సాహిస్తుండడం భూపేష్‌ ప్రభుత్వానికి మంచి మైలేజ్‌ చేకూరుస్తుంది. ప్రధాన నరేంద్ర మోదీ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆవు పేడలో కూడా స్కాం చేస్తుందని’ విమర్శించారంటే ఆవు పేడ రాబోయే ఎన్నికల్లో ఎంత కీలక పాత్ర పోషించనుందో తెలుస్తోంది.

హస్తానికి ప్రతికూలతలూ ఉన్నాయి

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు సీఎంకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యమంత్రి భూపేశ్‌కు ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌.సింగ్‌డియో, పీసీసీ చీఫ్‌ మోహన్‌ మార్కం మధ్య విభేదాలున్నాయి. మైనింగ్‌ ఆరోపణలలో ముఖ్యమంత్రి భూపేశ్‌ ప్రమేయం కంటే కొందరి మంత్రులు, అధికారుల హస్తం ఉందని ప్రజలు భావించడం వ్యక్తిగతంగా సీఎంకు సానుకూలాంశం. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా దెబ్బతిన్న రహదారులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ప్రభుత్వం పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికే అధిక ప్రాధాన్యతిస్తుందనే అసంతృప్తి ఉంది.

బీజేపీ ప్రచార జోరు

ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్న బీజేపీ.. భూపేశ్‌ ప్రభుత్వం వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని బీజేపీ ‘మోర్‌ ఆవాజ్‌ మోర్‌ అధికార్‌’ పేరిట నిరసనలు చేపట్టింది. దీనికి పోటీగా కాంగ్రెస్‌ ప్రభుత్వం గత జులైలో ‘గ్రామీణ ఆవాజ్‌ నయా యోజన్‌’ను ప్రారంభించినా ఈ అంశంపై కాంగ్రెస్‌ చర్యలు అప్పటికే ఆలస్యం అయ్యాయి.

గత ఎన్నికల్లో మహిళలను ఆకర్షించడానికి కాంగ్రెస్‌ ఇచ్చిన మద్య నిషేధం హామీని ప్రభుత్వం అమలు చేయకపోవడం బీజేపీకి సానుకూలంగా మారుతోంది. బస్తర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో క్రిస్టియన్‌ మిషనరీలు డబ్బు ప్రలోభాలతో గిరిజనులలో మత మార్పిడిని ప్రోత్సాహిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది.

గతంలో పదిహేను సంవత్సరాలు పాలించిన బీజేపీ హిందూత్వ అజెండాతోపాటు జాతీయ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రత్యేకతను గుర్తించడంలో ఇవ్వలేదని అసంతృప్తి ప్రజల్లో ఉండడం బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయి. బీజేపీ జాతీయత, హిందూత్వ అజెండాకు వ్యతిరేకంగా స్థానిక, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యతిస్తూ ప్రజలకు చేరువవడంలో ముఖ్యమంత్రి భూపేశ్‌ సఫలీకృతులయ్యారు. బీజేపీకి అధికారం రాకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం, సీట్లు పెరిగే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ అధ్యయనంలో తేలింది.

రాష్ట్రాన్ని నిరాటంకంగా 15 ఏండ్లు పాలించిన బీజేపీలో నాయకత్వ అనిశ్చితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ నేతృత్వంలో మూడు మార్లు అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అభ్యర్థిత్వం ప్రకటించకుండానే ప్రచారం చేస్తోంది. పార్టీలో ఆయనకు ప్రత్యామ్నాయం తేవాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం మోదీ చరిష్మాను చూసి కమలం పువ్వుకు ఓటేయమని పిలుపునిస్తోంది. రథసారథి లేకుండా ప్రయాణం చేస్తున్న రాష్ట్ర బీజేపీ కార్యకర్తల్లో ఈ వ్యవహారం గందరగోళం కలిగిస్తోంది.

ఏ సామాజిక వర్గం మద్దతు ఎటు?

రాబోయే ఎన్నికల్లో సామాజిక వర్గాల మద్దతుపై పీపుల్స్‌పల్స్‌ బృందం అధ్యయనం చేసింది.

  1. ఓబీసీలో కాంగ్రెస్‌కు ఆధిపత్యం కనిపిస్తోంది. కుర్మి, పానిక, అగ్రహారియా, కలార్‌ కులాలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి.
  2. ఓబీసీలోని సాహు, మరార్‌, దావాంగన్‌, యాదవ్‌లతో పాటు అగ్రవర్ణాల వారు బీజేపీ పక్షాన నిలుస్తున్నారు.
  3. ఎస్సీలలో సాత్నామి, హరిజన్‌, మాహర్‌ కులాలు కాంగ్రెస్‌ వైపు ఉన్నాయి.
  4. ఎస్టీలలో కైర్వార్‌, ఓరాన్‌, హల్బా కులాలు కాంగ్రెస్‌కు మద్దతిస్తుండగా, కాన్వార్‌, పహాడీ కోబ్రా కులాలు బీజేపీ పక్షాన ఉన్నాయి.
  5. గోండ్‌, మారియా-మురియా భాత్రా కులాల ఓట్లు రెండు పార్టీల మధ్య చీలే అవకాశాలున్నాయి. ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు కాంగ్రెస్‌కు ఏకపక్షంగా మద్దతిస్తున్నారు.

వీరి ప్రభావం ఎంత?

గత ఎన్నికల్లో బీఎస్పీ, జేసీసీ (జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌) 12 శాతం ఓట్లతో 7 సీట్లు సాధించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జేసీసీ ఉనికి లేకపోయినా జోగి కుటుంబంతో పాటు బీఎస్పీ ప్రభావం కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఆప్‌ కూడా బరిలోకి దిగుతున్నా ప్రభావం చూపే అవకాశాలు తక్కువే. మరోవైపు కాంగ్రెస్‌ మాజీ సీనియర్‌ నేత అరవింద్‌ నేతమ్‌ స్థాపించిన ‘సర్వ్‌ ఆదీవాసీ సమాజ్‌’ ఇప్పుడు ‘హమారా రాజ్‌ పార్టీ’గా ఆవిర్భవించి 50 స్థానాల్లో పోటీ చేయడం కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరమే.‘గోండ్‌వాన్‌ గణతంత్ర పరిషత్‌’, ‘ఛత్తీస్‌గఢ్‌ క్రాంతి సేన’ వంటి ప్రాంతీయ పార్టీలు బరిలోకి దిగుతున్నా వీటి ప్రభావం నామమాత్రమే.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌ 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారనే సంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉండడంతో పాటు బీజేపీలో ఉన్న నాయకత్వ అనిశ్చితి కూడా ఛత్తీస్‌గఢ్‌ కోటలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు డిసెంబర్‌ 3న వెలువడే ఫలితాల్లో మెండుగా ఉన్నాయి.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ,

Email: peoplespulse.hyd@gmail.com

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
తదుపరి వ్యాసం