Chandrayaan-3: చంద్రయాన్ 3 జర్నీలో కీలక పరిణామం; మళ్లీ చరిత్ర సృష్టించిన ఇస్రో
05 December 2023, 14:41 IST
Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రస్థానంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ ను ఇస్రో మళ్లీ భూ కక్ష్యలోకి విజయవంతంగా మార్చింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడివడుతున్న చిత్రం (ఫైల్ ఫొటో)
Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ తన విధులను విజయవంతంగా పూర్తి చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation ISRO) ప్రకటించింది. అయితే, దానినుంచి భవిష్యత్తులో మరిన్ని సేవలను పొందడానికి వీలుగా ఆ ప్రొపల్ష్ మోడ్యూల్ ను చంద్ర కక్ష్య నుంచి మళ్లీ భూ కక్ష్య లోనికి విజయవంతంగా తరలించినట్లు వెల్లడించింది.
భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం..
భవిష్యత్తులో చంద్రుడిపై ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టులకు అవసరమైన సమాచారం అందించడానికి వీలుగా చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ (Chandrayaan-3 Propulsion Module) ను మళ్లీ భూ కక్ష్యలోకి మార్చారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా నిర్దేశించిన ప్రధాన విధులను ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. భూ స్థిర కక్ష్య నుంచి చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోని చంద్ర కక్ష్యలోనికి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ (lander module) ను తీసుకువెళ్లడం, ఆ తరువాత ఇస్రో ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ మాడ్యూల్ ను తన నుంచి విడదీసి చంద్రుడి ఉపరితలంపైకి పంపించడం.. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధులు.
మిగిలి ఉన్న ఇంధనం..
తనలో మిగిలి ఉన్న అదనపు ఇంధనాన్ని వినియోగిస్తూ ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడిపై ఇస్రో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన సమాచారం అందిస్తుంది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి నుంచి 1.54 లక్షల కిమీల దూరంలో భూ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అయితే, దీనివల్ల ఆ కక్ష్యలో ఉన్న ఇతర సాటిలైట్స్ కు ఎలాంటి ముప్పు ఉండదని ఇస్రో తెలిపింది.