తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హిందీ భాషపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు

హిందీ భాషపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. భగ్గుమన్న విపక్షాలు

HT Telugu Desk HT Telugu

09 April 2022, 7:51 IST

google News
    • హిందీభాషపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నయంగా గుర్తించాల్సిన అవసరముందన్నారు. దేశంలో హిందీ నిఘంటువునూ సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
హిందీ భాషపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
హిందీ భాషపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

హిందీ భాషపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

దేశంలో హిందీ భాషను ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నయంగా గుర్తించాల్సిన అవసరముందని కేంద్ర హోమంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. హోంమంత్రి వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. దేశంలో ఆంగ్లానికి ప్రత్యామ్నయంగా హిందీని గుర్తించాల్సిన అవసరముందంటూ పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో వ్యాఖ్యనించారు. దేశ సమైక్యతను సాధించేందుకు అధికార భాష కీలక పాత్ర పోషించేందుకు తగిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో ఓ రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే అది భారతీయ భాష అయి ఉండాలని అమిత్‌ షా అన్నారు. 

కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్‌ అజెండాను 70 హిందీలోనే రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలో హిందీ నిఘంటువునూ సవరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు తొమ్మిదో తరగతి వరకు హిందీలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలని, హిందీ బోధనా పరీక్షలపైనా మరింతగా దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర భాషల నుంచి పదాలను స్వీకరించే విధంగా హిందీ మార్పు చెందితే తప్ప అది వ్యాప్తి చెందదని అమిత్‌ షా చెప్పారు.

భగ్గుమన్న విపక్షాలు....

అమిత్ షా వ్యాఖ్యలపై విప్షాలు మండిపడ్డాయి. దేశంలో అలజడి రేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. అమిత్‌ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా శివసేన, డీఎంకే, తృణమూల్‌ తీవ్రంగా స్పందించాయి. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అమిత్ షా తీరును దుయ్యబట్టారు. ‘‘హిందీ మా జాతీయ భాష కానే కాదు. దానిని జాతీయ భాషచేసేందుకు అనుమతించే ప్రసక్తిలేదని ట్వీట్‌ చేశారు. హిందీలోనే మాట్లాడాలని అనడం సాంస్కృతిక ఉగ్రవాదం లాంటిదేనని., బీజేపీ భావజాలాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశ భాషగా హిందీని గౌరవిస్తామని, ఆ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మాత్రం వ్యతిరేకిస్తామని టిఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ చెప్పారు. హిందీని జాతీయ భాషగా రుద్దే బదులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోకూడదని కునాల్‌ ఘోష్‌ ప్రశ్నించారు. 

ప్రాంతీయ భాషలు, పార్టీల విలువను తగ్గించే అజెండా ఉన్నట్లు అమిత్‌ షా మాటలు ఉన్నాయని శివసేన నేత మనీషా కయందే విమర్శించారు. అమిత్‌షా ప్రకటన దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటిదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమైక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హిందీకి ఇంగ్లిషు ప్రత్యామ్నాయం కావాలని, అన్నిహిందీయేతర రాష్ట్రాలూ హిందీకి ఇంగ్లిషును ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నాయని డీఎంకే ఎంపీ టీకేఎస్‌ ఎలంగోవన్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో హిందీ కంటే తమిళమే ప్రాచీనమైందని, సంస్కృతం, ఉర్దూ, ఇతర భాషల మిశ్రమం హిందీ అని దానిని ప్రత్నామ్నయంగా అంగీకరించేది లేదన్నారు. ఏ ప్రాంతీయ భాష స్థానాన్నీ హిందీ ఆక్రమించబోదని, అది జరిగే పని కాదని ఎన్డీయే భాగస్వామపార్టీ అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్‌ అన్నారు. హిందీని రాజభాషగా అమలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం దాని వినియోగం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లో లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు భావిస్తున్నాయి.

తదుపరి వ్యాసం