Delhi Liquor Policy Probe: సిసోడియాకు మరో షాక్ - లుక్ ఔట్ నోటీసులు జారీ
21 August 2022, 10:00 IST
- look out circular on manish sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు మరో షాక్ ఇచ్చింది సీబీఐ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో ఆయన పేరును ఏ1గా పేర్కొన్న దర్యాప్తు సంస్థ... లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది.
మనీశ్ సిసోడియా
look out circular for delhi deputy cm manish sisodia: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన సీబీఐ... శనివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ఇంట్లో దాడులు కూడా చేపట్టింది. ఆయన మొబైల్ తో పాటు కంప్యూటర్ ను స్వాధీనం చేసుకోంది. ఈ నేపథ్యంలో... ఆయనకు మరో షాక్ ఇచ్చింది. మనీశ్ సిసోడియా సహా మొత్తం 13 మంది నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
15 మందిపై కేసులు...
ఈ అంశంలో మొత్తం 15 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. గతేడాది నవంబర్ లో తీసుకువచ్చిన నూతన ఎక్సైంజ్ పాలసీలో వీరు అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. ఇందులో ఎక్సైజ్ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది.
31 చోట్ల దాడులు...
శుక్రవారం మనీష్ సిసోడియా నివాసంతో పాటు మరో 31 చోట్ల సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన విద్యాశాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఐతే మద్యం పాలసీ రూపకల్పన సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో సీబీఐ సోదాలు చేసి.. పలు కీలక ఆధారాలను సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియాను ఏ1గా పేర్కొంది.
లుక్ ఔట్ నోటీసులపై మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ సోదాల్లో ఏమీ దొరకలేదన్న ఆయన... ఇప్పుడేమో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారని ట్వీట్ చేశారు. తాను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానని.. ఎక్కడికి రావాలో చెప్పండి వస్తాను అంటూ రాసుకొచ్చారు.
ఈ కేసులో బీజేపీ - ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీబీఐని ప్రయోగించి... బీజేపీ సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. సిసోడియాపై సీబీఐ ఆరోపణలను ఆప్ ప్రభుత్వ కూడా ఖండించింది. మరోవైపు బీజేపీ నేతలు కూడా... ఆప్ సర్కార్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
టాపిక్