Byju's: 500 ఉద్యోగులను తొలగించామన్న బైజూస్.. 1,100 అంటున్న ఉద్యోగులు
30 June 2022, 14:57 IST
- ఉద్యోగం నుంచి రిజైన్ చేయాలని కాల్ వచ్చిందని, మొత్తం 100 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
కోవిడ్ సమయంలో బాగా వ్యాపారం చేసిన ఎడ్‌టెక్ కంపెనీలు క్రమంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీ, జూన్ 30: ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ తన అనుబంధ వైట్‌హాట్ జూనియర్, టాపర్ యాప్‌ల నుంచి 500ల కంటే తక్కువగానే ఉద్యోగులను తొలగించినట్టు గురువారం వెల్లడించింది. అయితే ఒక్క టాపర్(Toppr) లోనే 1,100 మందిని తొలగించారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బైజూస్ గ్రూపులోని వైట్‌హాట్ జూనియర్ నుంచి 300 మంది ఉద్యోగుల తొలగింపు, ఏప్రిల్-మే నెలల్లో 250 మంది ఉద్యోగుల రాజీనామాలతో పాటు ఈ టాపర్ లే ఆఫ్ కూడా వెలుగుచూసింది.
‘మా వ్యాపార ప్రాధాన్యతలను సమీక్షించుకోవడానికి, దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యంగా మా గ్రూపు కంపెనీలో ఉద్యోగ బృందాలను ఆప్టిమైజ్ చేస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో 500 కంటే తక్కువే ఉద్యోగులు ఉన్నారు..’ అని బైజూస్ అధికార ప్రతినిధి చెప్పారు.
అయితే కంపెనీ నుంచి తమకు సోమవారం కాల్ వచ్చిందని, రాజీనామా చేయాలని అడిగారని, లేదంటే ఎలాంటి నోటీస్ పీరియడ్ లేకుండా తొలగిస్తామని చెప్పారని టాపర్స్ ఉద్యోగులు వాపోయారు.
‘నేను కెమిస్ట్రీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ టీమ్‌లో భాగం. నా టీమ్ మొత్తాన్ని తీసేశారు. రిజైన్ చేసిన వారికి 1 నెల వేతనం ఆఫర్ చేశారు. రిజైన్ చేయనివారికి వేతనం ఇవ్వమని చెప్పారు. మొత్తం టాపర్ విభాగంలో 1,100 ఉద్యోగులను తొలగించారు..’ అని ఓ ఉద్యోగి పీటీఐకి వివరించారు.
టాపర్ కో-ఫౌండర్ జీషన్ హయాత్‌ను వాట్పాప్‌లో సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.
కాగా ‘వైట్‌హాట్ జూనియర్’ విభాగం స్పోక్స్‌పర్సన్‌ను సంప్రదించగా.. బిజినెస్ ప్రయారిటీస్ రీఅలైన్ చేసేందుకు, దీర్ఘకాలిక వృద్దిపై ఫోకస్ చేస్తూ ఫలితాలను వేగంగా అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
‘బ్యాక్ టూ వర్క్ డ్రైవ్‌లో భాగంగా మా సేల్స్, సపోర్ట్ టీమ్స్ ఎంప్లాయిస్‌ను గురుగ్రామ్, ముంబై ఆఫీసులకు ఏప్రిల్ 18 నుంచి రమ్మన్నాం. వైద్యపరమైన, వ్యక్తిగతమైన అవసరాలు ఉన్నవారిని మినహాయింపు ఇచ్చాం. రీలొకేషన్ అసిస్టెన్స్ అవసరమైన వారికి అందించాం..’ అని వివరించారు.
‘మా ఉపాధ్యాయులు ఇంటి నుంచి పనిచేయడం కొనసాగిస్తారు. అవసరమైన పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడంపై మా పెట్టుబడులు కొనసాగిస్తాం. అత్యధిక శిక్షణా ప్రమాణాలతో కూడిన టీచర్ కమ్యూనిటీని నిర్మిస్తాం..’ అని వివరించారు.
టాపర్ యాప్‌ను బైజూస్ గత ఏడాది జూలైలో 150 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
టాపర్ నుంచి తొలగించిన మరొక ఉద్యోగి మాట్లాడుతూ కంపెనీలో హై గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయని హయాత్‌తో సహా టాప్ మేనేజ్‌మెంట్ ఈ ఏడాది ఆరంభంలో తెలిపిందని వివరించారు.
‘అయితే దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ క్లాసెస్ ప్రారంభమయ్యాక వ్యాపారం తగ్గిందని మాకు సంకేతాలు వస్తున్నాయి. నేను ‘వైట్‌హాట్ జూనియర్’లో వర్క్ చేశాను. ఆఫ్‌లైన్ క్లాసులకు ఆన్‌లైన్ క్లాసులు సరితూగడం లేదు..’ అని ఆ ఉద్యోగి అన్నారు.
ఎడ్‌టెక్ సంస్థలు అన్‌అకాడమీ, వేదాంతు,లిడో, ఫ్రంట్‌రో తదితర సంస్థలు ఈ ఏడాది మొత్తంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.