తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget 2022 | 'పన్నులు పెంచి.. డబ్బు సంపాదించాలని అనుకోలేదు'

Budget 2022 | 'పన్నులు పెంచి.. డబ్బు సంపాదించాలని అనుకోలేదు'

HT Telugu Desk HT Telugu

01 February 2022, 18:02 IST

google News
    • Nirmala Sitharaman budget 2022 | పార్లమెంట్​లో బడ్జెట్​ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్​.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పన్నులు పెంచి ఒక్క పైసా కూడా ప్రభుత్వం సంపాదించాలనుకోలేదని స్పష్టం చేశారు. గతేడాది పన్నులు పెంచలేదని, ఇప్పుడు కూడా వాటి జోలికి వెళ్లలేదని తెలిపారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్​
మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్​ (hinustan times )

మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్​

Union budget 2022 | 2022 బడ్జెట్​ ద్వారా ప్రజలపై పన్నుల భారాన్ని మోపాలనుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. గతేడాది కూడా పన్నులు పెంచలేదన్నారు.

పార్లమెంట్​ సమావేశాల్లో భాగంగా..మంగళవారం కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు నిర్మల. అనంతరం మీడియాతో మాట్లాడారు. పన్నులు పెంచకపోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు.

"పన్నులు పంచలేదు. మళ్లీ చెబుతున్నాను.. పన్నులు పెంచలేదు. గతేడాది కూడా పన్నులు పెంచలేదు. పన్నుల రూపంలో ఒక్క రూపాయి కూడా సంపాదించాలనుకోలేదు. కరోనా సంక్షోభం కారణంగా.. పన్నులు పెంచి ప్రజలపై భారం మోపకూడదని ప్రధాని మోదీ గతేడాది అధికారులకు సూచించారు. సంక్షోభంతో సతమతవుతున్న ప్రజలపై పన్నుల ప్రభావం పడకూడదన్నారు. ఈసారి కూడా ఇలాంటి సూచనలే అందాయి. ప్రజలను కష్టపెట్టి.. మేము కరోనా సంక్షోభం నుంచి ఉపశమనం పొందాలి అని అనుకోలేదు," అని నిర్మల స్పష్టం చేశారు.

బడ్జెట్​ ప్రసంగంలో ఇది గమనించారా?

Union Budget Of India | నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టారు అంటే.. దేశ ప్రజల్లో ఆశలతో పాటు ఆమె ప్రసంగం నిడివిపైనా అంచనాలు భారీగా ఉంటాయి. 2022తో నాలుగోసారి నిర్మల బడ్జెట్​ ప్రవేశపెట్టారు. 2019లో తొలిసారిగా పార్లమెంట్​ ముందుకు బడ్జెట్​ను తీసుకొచ్చారు. అప్పటి నుంచి నిర్మలమ్మ పద్దు ప్రసంగం నిడివిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. 2003లో నాటి కేంద్ర ఆర్థికమంత్రి జశ్వంత్​ సింగ్​ రికార్డును(2 గంటల 15 నిమిషాలు) తిరగరాశారు.

ఇక 2020లో నిర్మల ప్రసంగం 2 గంటల 40 నిమిషాలు సాగింది. దేశ చరిత్రలో అదొక రికార్డు. వాస్తవానికి అప్పటికి బడ్జెట్​ ప్రసంగం పూర్తికాలేదు. మరో రెండు పేజీలు ఉండగానే అలసట కారణంగా ఆమె ప్రసంగాన్ని ముగించేశారు. 2021లో 1 గంట 50 నిమిషాల పాటు బడ్జెట్​పై మాట్లాడారు నిర్మల. 

ఈ లెక్కన చూసుకుంటే.. నిడివి పరంగా నిర్మలా సీతారామన్​కు ఇదే అతి తక్కువ బడ్జెట్​ ప్రసంగం(91 నిమిషాలు). బడ్జెట్​ ప్రసంగం మధ్యలో అనేకసార్లు ఆమె గ్లాసులో నీరు తాగుతూ కనిపించారు.

వాస్తవానికి దేశ చరిత్రలో బడ్జెట్​ ప్రసంగం 90నిమిషాలు- 120 నిమిషాల మధ్యే ఉండేది. నిర్మల రాకతో అది మారిపోయింది.

ప్రధాని ప్రశంసలు..

PM Modi on Budget |నిర్మలమ్మ పద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాభివృద్ధికి దోహదపడే విధంగా బడ్జెట్​ను రూపొందించారని కొనియాడారు.

అయితే విపక్షాలు మాత్రం 2022 బడ్జెట్​పై విమర్శల వర్షం కురిపించాయి. వాస్తవానికి నిర్మల ప్రసంగంలో ఏమీ లేదని ఎద్దేవా చేశాయి. ప్రజలు, చిన్న పరిశ్రమల ఆశలు, అంచనాలను అందుకోవడంలో ఈ దఫా బడ్జెట్​ విఫలమైందని ఆరోపించాయి.

తదుపరి వ్యాసం