Britain PM race: జాన్సన్, మోర్డంట్, సునక్.. బ్రిటన్ పీఎం రేసులో త్రిముఖ పోటీ!
22 October 2022, 14:59 IST
Britain PM race: బ్రిటన్ లో రాజకీయ డ్రామా రసవత్తరంగా సాగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య కేవలం 45 రోజులకే ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి ప్రధాని ఎవరన్న విషయంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
బోరిస్ జాన్సన్, రిషి సునక్
Britain PM race: అయితే, నాలుగు నెలల క్రితం అవమానకర రీతిలో ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చిన బోరిస్ జాన్సన్ మళ్లీ బ్రిటన్ నెక్స్ట్ పీఎం రేసులోకి వచ్చారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కానీ జాన్సన్ సన్నిహితులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
Britain PM race: హుటాహుటిన లండన్ కు
బోరిస్ జాన్సన్ ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, బ్రిటన్ లో ఆకస్మికంగా నెలకొన్న రాజకీయ సంక్షోభంతో ఆయన వెకేషన్ నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. లండన్ కు వచ్చే ఫ్లైట్ లో ఆయనకు అభిమానులు కేరింతలతో స్వాగతం పలికినట్లు సమాచారం.
Britain PM race: రిషి సునక్..
ఈ సారి ప్రధాని అభ్యర్థి ఎంపిక వారం రోజుల్లోనే ముగియనుంది. ఈ పోటీలో అధికారికంగా నిలబడాలంటే కనీసం 100 మంది కన్సర్వేటివ్ పార్టీ ఎంపీల మద్ధతు అవసరం. భారతీయ సంతతికి చెందిన నేత రిషి సునక్ కు ఇప్పటికే ఆ మద్ధతు లభించిందని ఆయన మద్దతుదారు ఒకరు ప్రకటించారు. దాంతో, సునక్ పోటీ దాదాపు ఖాయమైనట్లే.
Britain PM race: త్రిముఖ పోటీ
Britain PM race: జాన్సన్ కు టోరీ ఎంపీల నుంచి అవసరమైన మద్దతు లభించిందని, తాను పోటీలో ఉన్నట్లు జాన్సన్ తెలిపాడని ఆయనకు సన్నిహితుడైన వాణిజ్య శాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి మాజీ రక్షణ మంత్రి పెన్నీ మోర్డంట్ మాత్రమే అధికారికంగా పోటీలో ఉన్నారు. అయితే, రిషి సునక్, బోరిస్ జాన్సన్ లు కూడా బరిలో నిలవడం దాదాపు నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో పీఎం పదవికి త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి నెలకొంది.
Britain PM race: పోటీ నుంచి తప్పుకోవాలని సునక్ కు అభ్యర్థన
ఈ నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుని తనకు మద్దతివ్వాలని తన మంత్రివర్గంలో ఫైనాన్స్ మంత్రిగా పని చేసిన రిషి సునక్ ను బోరిస్ జాన్సన్ అభ్యర్థించినట్లు సమాచారం. తద్వారా, సునక్ మద్దతుదారులు కూడా తనకు ఓటేస్తే.. తన విజయం ఖాయమవుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే, ఈ విషయమై ఇటు జాన్సన్ వర్గం నుంచి కానీ, అటు సునక్ వర్గం నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Britain PM race: జాన్సన్ కు అవకాశాలెన్ని?
కన్సర్వేటివ్ పార్టీలో బోరిస్ జాన్సన్ కు మద్దతుదారులెందరున్నారో? అంతే స్థాయిలో వ్యతిరేకులు కూడా ఉన్నారు. అయితే, 2024లో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ టోరీలు అధికారంలోకి రావాలంటే, ఆ శక్తియుక్తులు బోరిస్ జాన్సన్ కు మాత్రమే ఉన్నాయని పార్టీలో అత్యధికులు భావిస్తున్నారు. అనూహ్య స్కామ్ లు, కోవిడ్ నియంత్రణలో వైఫల్యం తదితర అంశాల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ, పాలనా పటిమలో బోరిసే బెటరని వారు భావిస్తున్నారు. మరోవైపు, బోరిస్ జాన్సన్ మళ్లీ పీఎం అయితే, చాలా మంది ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.