BJP to tie up with JDS: కర్నాటకలో బీజేపీకి కొత్త ఫ్రెండ్; బీజేపీతో కలిసి పోటీ చేయనున్న జేడీఎస్
08 September 2023, 14:15 IST
BJP to tie up with JDS: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కర్నాటక రాజకీయాల్లో కొత్త పొత్తుల కోసం బీజేపీ (BJP) ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే 2024 లోక్ సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ (JDS) తో కలిసి పోటీ చేయనుంది.
మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవే గౌడ
BJP to tie up with JDS: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections) కర్ణాటకలో బిజెపి ఘోరంగా ఓడిపోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కొత్త వ్యూహంతో బిజెపి ముందుకు వెళ్తుంది.
జేడీఎస్ తో పొత్తు..
2024 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి మాజీ ప్రధాని దేవే గౌడ నేతృత్వంలో ని జేడీ ఎస్ (జనతాదళ్ సెక్యులర్) తో కలిసి పోటీ చేయనుంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప వెల్లడించారు. దేవే గౌడ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారని, వారిద్దరి మధ్య కర్ణాటకలో కలిసి పోటీ చేయడంపై ఒప్పందం కుదిరిందని ఎడ్యూరప్ప తెలిపారు. కర్ణాటకలో ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న జేడీఎస్ క్రమంగా తన ప్రభావం కోల్పోతూ వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కి ఒకే ఒక స్థానం దక్కింది. అది కూడా దేవేగౌడ కుటుంబాన్ని గట్టిపట్టున్న హసన్ లోక్ సభ స్థానాన్ని మాత్రమే జెడిఎస్ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆయన మనవడు ప్రజ్వల్ రేవన్న గెలుపొందారు. అయితే ఆయన తప్పుడు అఫిడవిట్లో సమర్పించారన్న ఆరోపణలపై కర్ణాటక హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది.
19 సీట్లే..
కాగా 2024 లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్ బిజెపి కలిసి పోటీ చేయడం రెండు పార్టీలకు ప్రయోజనకరమైన అని కర్నాటక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక జాతీయ పార్టీతో, ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్డీయేతో జత కూడడం జేడీఎస్ కు అత్యంత ఆవశ్యకతగా మారింది. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 19 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు 19 స్థానాలకు పరిమితం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో బిజెపితో కలిసి పోటీ చేయడంపై జేడీఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రా యాలను దేవేగూడ తీసుకున్నారు. వారందరూ కూడా బిజెపితో పొత్తు విషయంలో సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతో దేవే గౌడ బిజెపితో పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకొని, ప్రధాని మోదీని కలిశారు. వారిద్దరి మధ్య చర్చల్లో నాలుగు లోక్ సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరిందని ఎడ్యూరప్ప వెల్లడించారు.
లింగాయత్, వొక్కలిగ
కర్నాటకలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన ‘లింగాయత్ (Lingayat)’ ల మద్దతు ఇప్పటికే బీజేపీకి ఉంది. ఎడ్యూరప్ప రాష్ట్రంలోని లింగాయత్ లకు బలమైన నేతగా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలోని మరో బలమైన సామాజిక వర్గం ‘వొక్కలిగ (Vokkaliga)’ ల్లో గట్టి మద్దతు ఉన్న జెడిఎస్ కూడా బిజెపితో కలిసి రావడంతో ఆ పార్టీ మద్దతు రాష్ట్రంలో గణనీయంగా పెరగనుంది. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని యెడ్యూరప్ప వెల్లడించారు.