తెలుగు రాష్ట్రాల్లో అట్టడుగున బీజేపీ.. ఎక్కడ తప్పు జరిగింది?
03 July 2023, 15:25 IST
- ‘ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎదుగుబొదుగూ లేకుండా ఎదురీదుతోంది. దశబ్దాలుగా తెలుగునాట బీజేపీది ఇదే పరిస్థితి..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ విశ్లేషణ.
బీజేపీ
ప్రపంచంలోనే తమది అతిపెద్ద పార్టీ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశంలో ఎక్కడకెళ్లినా, సభల్లో ఫీుంకరిస్తుంటారు. సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని కూడా అధిగమించామని అమిత్ షా 2015లో ప్రకటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎదుగుబొదుగూ లేకుండా ఎదురీదుతోంది. దశబ్దాలుగా తెలుగునాట బీజేపీది ఇదే పరిస్థితి. బీజేపీని ఒక శక్తిగా మార్చిన అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్.కే అడ్వాణీల నాయకత్వంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు మోదీ, అమిత్ షాల కాలంలోనూ తోక పార్టీగానే మిగిలిపోతోంది.
ఎందుకు బీజేపీని తెలుగువాళ్లు దూరం పెడుతున్నారు? అనే ప్రశ్నకు పలు సమాధానాలు ఉన్నాయి. ఈ సమాధానాల సమాహారాన్ని అర్థం చేసుకోవాలంటే ఆర్.ఎస్.ఎస్. ప్రముఖుడి ఒకరి మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆయన ఒక ప్రముఖ పాత్రికేయుడితో ముచ్చటిస్తూ ‘ప్రయత్నిస్తే పాకిస్తాన్‌లో అయినా బీజేపీ గెలుస్తుంది. కానీ, తెలుగు రాష్ట్రాలో మాత్రం గెలవదు’ అని బల్లగుద్ది చెప్పారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే, ఆయన మాటను నిజం చేసే పనిలో బీజేపీ నాయకులు నిమగ్నమైనట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ దశబ్దాలుగా ఒక ప్రణాళిక ప్రకారం ఎదుగుతూ వచ్చిన పార్టీ. ఆర్.ఎస్.ఎస్ శిక్షణలో మూలాల నుంచి మంచి నాయకత్వాన్ని నిర్మించుకున్న పార్టీ. బలమైన వేర్లతో పార్టీని నిర్మించే బీజేపీ, తెలుగునాట దీనికి రివర్సుగా వేర్లను వదిలి అరువు నాయకులతో కొమ్మలను అంటుగడుతూ వస్తున్నది. అందుకే, గాలి గట్టిగా వచ్చినప్పుడల్లా పేకమేడలా కూలిపోతున్నది. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఒక్క మాస్ లీడర్ కూడా తెలుగు రాష్ట్రాల బీజేపీలో పుట్టకపోవడమే దీనికి నిదర్శనం.
అరువు నాయకులే దిక్కు
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఉన్నవాళ్లలో అరువు నాయకులే ఎక్కువగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగలడానికి ప్రధాన కారణం ప్రాంతీయంగా మాస్ లీడర్లు లేకపోవడమే అని గుర్తించిన పార్టీ అధిష్టానం ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడానికి ప్లాన్ వేసింది. దీని కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చేరికల కమిటీని నియమించి విస్తూపోయేలా చేసింది.
అంతేకాదు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో బీజేపీ బలహీనంగా ఉందని, ఈ మూడు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట ఉపఎన్నిక తీసుకొచ్చి గెలిపించుకుంటే పార్టీ బలపడుతుందని అమిత్ షాకి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ సంస్థ నివేదిక ఇచ్చింది. దీనికనుగుణంగా అమిత్ షా, మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపారు. మొదటి నుంచి అసలు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడమే తప్పని, ఆయన ఓడిపోతాడని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పారు. కానీ, అహంకారంతో ఉపఎన్నికకు వెళ్లి బొక్కబొర్లా పడ్డారు. దాంతో పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది బీజేపీ పరిస్థితి.
అరువే.. బరువు
అరువు నాయకుల ప్రయోగం పశ్చిమ బెంగాల్‌లో పనిచేయలేదు. తృణముల్ కాంగ్రెస్ నుంచి చేర్చుకున్న నాయకులకు జాతీయ పదవులు కట్టబెట్టినా, ఎన్నికల ఫలితాల తర్వాత వారంతా తిరిగి సొంత గూటికే చేరిపోయారు. కాంగ్రెస్ రక్తంతో నిండిపోయిన తెలుగు రాష్ట్రాల బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితులే రిపీట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి ఈ అరువు నాయకుల్లో ఎంతమంది ఉంటారు? ఎందరు వెళ్లిపోతారు? అనే గుసగుసలు పార్టీలో వినపడుతున్నాయి.
పగటి కలలు మానాలి
పార్టీలో దిశా నిర్దేశం చేసే సరైన నాయకుడు లేడు. పట్టుమని 60 సీట్లలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులూ లేరు. అయినా వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని తెలంగాణ బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారు. ఆర్‌ఎస్.ఎస్. ప్రముఖ సిద్ధాంతకర్త దత్తోపంత్ ఠేంగ్డే 1988లో నాగ్‌పూర్‌లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ... ‘నాలో ఎన్నో అవగుణాలు ఉండొచ్చు. కానీ, రొమాంటిజమ్ మాత్రం లేదు.’’ అన్నారు. ప్రస్తుత పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆయన మాటల్ని అన్వయించుకుంటే, అధికారంలోకి వచ్చేశామనే రొమాంటిజం నుంచి బయటపడి వాస్తవాలకు దగ్గరగా ఆలోచిస్తారు.
చేతులు కాలాక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వ మార్పుపై కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్నికల ముందు అధ్యక్షుల మార్పు వల్ల ఒరిగేదేం ఉండదు. ఇది కూడా చేతుల కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. కిషన్ రెడ్డి 2010 నుంచి 2016 వరకు ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత తెలంగాణ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన నాయకత్వంలోనే 2014లో ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుపెట్టుకుంటే, గెలిచిన సీట్లు 5 మాత్రమే. ఆయన పగ్గాలు చేపట్టిన ఆ ఆరేళ్లలో పార్టీ బలోపేతం చేసిన ఆనవాళ్లు ఏమీ లేవు. ఆ తర్వాత కూడా కిషన్ రెడ్డి ఒక మాస్ లీడర్‌గా ప్రొజెక్ట్ అయిన దాఖలాలు లేవు.
పైగా, తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పిలుపునిచ్చినా, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదనే అపవాదును కిషన్ రెడ్డి మోస్తున్నారు. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయా... ఈ ఇద్దరూ నరేంద్రమోదీ కేబినేట్‌లో మంత్రులుగా పని చేసినా... పార్టీని బలోపేతం చేయలేదని బీజేపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఆయన్ను అధ్యక్షుడిని చేస్తే, పాత నీరునే కొత్త సీసాలో నింపినట్టవుతుంది. మరోవైపు ఇక్కడ పార్టీ పరిస్థితులను చక్కదిద్దడం పులిమీద స్వారీ చేయడమే అని భావిస్తున్న కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి కంటే కేంద్ర మంత్రిగానే కొనసాగడానికి ఇష్టపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఏం చేశారనీ
గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణకుగానీ, ఏపీకీగానీ ఫలనా మేలు చేశామని బీజేపీ చెప్పే పరిస్థితుల్లో లేదు. చరిత్ర గుర్తు పెట్టుకునే ఒక్క మేలు కూడా ఈ రాష్ట్రాలలో తలపెట్టలేదు. విభజన హామీల విషయంలో ఆంధ్రాకు కాంగ్రెస్ కన్నా బీజేపీయే పెద్ద మోసం చేసిందని ఆంధ్రా ప్రజలు కోపంగా ఉన్నారు. అందుకే, బీజేపీ నోటాతో పోటీపడుతోంది. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా బీజేపీ ఇటు బీఆర్‌ఎస్, అటు వైఎస్సార్సీపీతో ఆడుతున్న డబుల్ గేమ్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
2018 ముందు కూడా బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అనే సందేశం ప్రజల్లోకి వెళ్లడంతో పోటీ చేసినా 119 సీట్లలో 110 సీట్లలో డిపాజిట్లు కోల్పోయి కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనే భావన ఉండటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామని బీజేపీ నాయకుడు మాధవ్ బహిరంగంగానే ఒప్పుకున్నారు. మరోవైపు జనసేనతో మిత్రపక్షంగా ఉండి, రోడ్డు మ్యాప్ ఇస్తామని చెప్తూనే అటు అధికార వైఎస్సార్‌సీపీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం దేనికి సంకేతం? అందుకే ఆంధ్రాలో బీజేపీ నోటా కంటే వెనకపడిరది.
జోక్యం ముంచుతోంది
జాతీయ నాయకత్వం ముఖ్యంగా అమిత్ షా, బీఎల్ సంతోష్ ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటున్నట్టు పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. వేరే పార్టీ నుంచి నాయకులు బీజేపీలో చేర్చుకునేందుకు బీఎల్ సంతోష్ తరఫున కొంతమంది స్వామిజీలు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో రిసార్టుల్లో మాట్లాడిన తీరు ఆ పార్టీ విశ్వసనీయతకు గండికొట్టింది. ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుందో అధినాయకత్వం ఆలోచించనట్టుగా తోస్తుంది.
పైగా, జాతీయ నాయకత్వంలో ఎవరు ఇక్కడికి వచ్చినా పార్టీ బలోపేతం చేయమని చెప్పడం కన్నా, నాయకులను చేర్చుకోండని చెప్పి వెళ్లడం, బీజేపీ పతనానికి మరో కారణం. ముందు నుంచి ఉన్న నాయకులకంటే, కొత్తగా వస్తున్నవారికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ముందు నుంచి పార్టీలో ఉన్న కాషాయవాదులు తమ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో గెలవకపోతేనే మంచిదనే భావనలో ఉన్నారు. మోదీ, అమిత్ షా, నడ్డా పర్యటిస్తే అధికారంలోకి వచ్చేస్తామని రాష్ట్ర నాయకులు భ్రమల్లో బతుకుతున్నారు. ఈ ముగ్గురూ కర్ణాటకలో ఎన్ని ర్యాలీలు చేసినా, అక్కడ ప్రజలు తిరస్కరించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈ ముగ్గరు ప్రచారం చేయకున్నా బీజేపీ గెలిచిందని గుర్తుపెట్టుకోవాలి.
చేసిన మంచిని విడిచిపెట్టి
తెలంగాణ ఏర్పాటులో బీజేపీది కీలక పాత్ర. తెలంగాణ ఏర్పాటుపై 1997 జూలైలో మొదటిసారి కాకినాడలో తీర్మానం చేసిన పార్టీ బీజేపీ. 2006లో అప్పటి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అదే సంవత్సరం 2006లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండారు దత్తాత్రేయ, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి సీహెచ్. విద్యాసాగరరావు చైర్మన్‌గా ‘తెలంగాణ ఉద్యమ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
2009లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని స్వయంగా అద్వానీతో చెప్పించారు. 2011లో ఆదిలాబాద్‌లో జరిగిన ఉద్యమ ర్యాలీలో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. కరీంనగర్, నల్లగొండల్లో జరిగిన ర్యాలీల్లో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. చివరికి తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలిపి తెలంగాణ ఏర్పాటుకు కారణమైంది కూడా బీజేపీయే. తెలంగాణ కోసం ఇన్ని చేసినా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తాము పోషించిన కీలక పాత్రని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమై చతికిలపడిరది.
పూలు పెడుతున్నారా?
తెలంగాణ వస్తే 16 ఎంపీ సీట్లు తెచ్చిస్తామని 2014కి ముందు కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీని బురిడీ కొట్టించినట్టుగానే, బీజేపీ నాయకులు కూడా కవితను అరెస్టు చేసి కేసీఆర్‌ని జైళ్లో పెడితే తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జాతీయ నాయకత్వం చెవిలో పూలు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులోగానీ, ఉద్యమంలోగానీ కాంగ్రెస్, బీజేపీల పాత్ర ఎంతో ఉంది. కానీ, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలం కావడంతో రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో పడిపోయింది. ఈ రెండు పార్టీలు చేసిన తప్పులే కేసీఆర్‌ని తెలంగాణ గాంధీగా మార్చాయి. బీజేపీని దివాళ తీయిస్తున్నాయి. రాష్ట్రానికి తాము చేసిన ప్రయోజనాలు, అందించిన చేయూత గురించి చెప్పుకోకుండా ఎదుటువారిని విమర్శించడం, ఇతరులను పార్టీలోకి చేర్చుకోవడం వంటి కార్యకలాపాలతో ఎప్పటికీ అందలం ఎక్కలేమనే విషయాన్ని అర్థం చేసుకోనంత వరకు ఇక్కడ బీజేపీ మనుగడ కష్టమే.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం లేదా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి. హెచ్‌టీ తెలుగువి కావు.)