Bill Gates | ‘మాజీ భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది’
02 May 2022, 16:35 IST
- అమెరికా: బిల్ గేట్స్- మెలిండాలు విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా.. మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అన్న ప్రశ్నకు జవాబిచ్చారు బిల్ గేట్స్.
బిల్ గేట్స్- మెలిండ్ గేట్స్
Bill Gates Melinda Gates | అవకాశం లభిస్తే.. తన మాజీ భార్య మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని అంటున్నారు బిల్ గేట్స్. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
30ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం.. 2021 మేలో విడాకులు ప్రకటించారు బిల్ గేట్స్- మెలిండా దంపతులు. ఇది ఒక రకంగా అందరిని షాక్కు గురిచేసింది. చివరికి 2021 ఆగస్టులో ఇద్దరు విడిపోయారు. అయినప్పటికీ.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫాండేషన్ను ఇద్దరు కలిసే నిర్వహిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు.
ఈ క్రమంలోనే వివాహం గురించి మాట్లాడారు బిల్ గేట్స్.
"వివాహ బంధంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒకలాగ ఉంటుంది, వాళ్లు ఇల్లు విడిచి వెళ్లిపోయిన తర్వాత ఒకలాగ ఉంటుంది. కానీ ఈ మార్పులు నా విడాకులకు దారితీశాయి. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అసలు విడాకులు తీసుకున్నట్టు నేను ఇంకా పూర్తిగా అంగీకరించలేకపోతున్నాను. (మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని అడిగినప్పుడు..) మెలిండాను మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉంది. భవిష్యత్తులో అలాంటి ప్రణాళికలేవీ లేవు. కానీ జరగాలని కోరుకుంటున్నాను," అని బిల్ గేట్స్ అన్నారు.
భార్య-భర్తలుగా విడిపోయినప్పటికీ.. మెలిండాతో తనకు స్నేహబంధం ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు తెలిపారు. ఇద్దరు కలిసి వివిధ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నట్టు వెల్లడించారు. 'విడాకుల తర్వాత కూడా మేమిద్దరం కలిసి పనిచేస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ను మేమిద్దరం కలిసే నిర్మించాము,' అని అన్నారు.
అసలు మీ వివాహ బంధం ఎందుకు ముగిసింది? అన్న ప్రశ్నకు 'బంధాలు చాలా కష్టంగా ఉంటాయి. వాటిని లోతుగా పరిశీలించడం కూడా కష్టమే,' అని జవాబిచ్చారు బిల్ గేట్స్.
టాపిక్