Nitish Kumar: “ఆ ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలి.. 2024కు సెమీఫైనల్స్”: ఢిల్లీ, బిహార్ సీఎంల భేటీ
21 May 2023, 16:30 IST
- Nitish Kumar meets Kejriwal: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలను ఐక్యం చేస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‍ను ఆయన కలిశారు.
Nitish Kumar: “ఆ ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలి.. 2024కు సెమీఫైనల్స్”: ఢిల్లీ, బిహార్ సీఎంల భేటీ
Nitish Kumar meets Kejriwal: 2024 లోక్‍సభ ఎన్నికల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసే పనిలో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఉన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను ఆదివారం ఆయన కలిశారు. ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్జినెన్స్‌ను ప్రతిపక్షాలు ఓ ప్రణాళిక ప్రకారం అడ్డుకోవాలని, 2024కు ముందు ప్రతిపక్షాలకు ఇది సెమీఫైనల్ అని కేజ్రీవాల్ అన్నారు. ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా నితీశ్‍తో ఉన్నారు. పూర్తి వివరాలు ఇవే.
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్లు, నియామకాలపై నియంత్రణ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పును ఇచ్చింది. దీంతో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ సంబరాలు చేసుకుంది. కేంద్రంతో యుద్ధంలో పెద్ద విజయం సాధించామని చెప్పింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా, ఆ తీర్పు అమలు కాకుండా అడ్డుకునేందుకు ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆ ఆర్డినెన్స్ ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మళ్లీ అధికారాలు వెళతాయని అన్నారు. ఈ మేరకు ఆ ఆర్డినెన్స్ వస్తే రాజ్యసభలో అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతును కూడగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్.. ఆదివారం కేజ్రీవాల్ దగ్గరికి వచ్చి మద్దతు తెలిపారు.
ఆ సందేశం పంపాలి
Nitish Kumar meets Kejriwal: ఈ విషయంపై తమకు పూర్తి మద్దతు ఇస్తామని, కలిసి పోరాడుతామని నితీశ్ కుమార్ తమతో చెప్పారని కేజ్రీవాల్ వెల్లడించారు. “ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మేం కలిసి పోరాడుతాం. బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలిసిరావాలని నేను అభ్యర్థిస్తున్నా. బిల్ రూపంలో ఈ ఆర్డినెన్స్ రాజ్యసభ ముందుకు వస్తే.. ఓడించవచ్చు. రాజ్యసభలో ఈ చర్య(ఆర్డినెన్స్)ను అడ్డుకోగలిగితే ఇది సెమీఫైనల్ అవుతుంది. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదనే మెసేజ్‍ను దేశవ్యాప్తంగా పంపించవచ్చు” అని కేజ్రీవాల్ అన్నారు.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారాలను కేంద్రం ఎలా లాక్కుంటుందని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. “పని చేసుకునే హక్కును ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఇచ్చింది. దాన్ని ఎలా లాక్కుంటారు? ఇది చాలా ఆశ్చర్యకరం. మేము వీరి(ఆమ్ఆద్మీ)తో ఉంటాం. మరిన్ని సమావేశాలు జరుపుతాం. ఈ అంశంపై దేశవ్యాప్త ప్రచారానికి వీలైనంత ఎక్కువ ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తాం” అని నితీశ్ కుమార్ అన్నారు.
“ఎనిమిది రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం అన్ని అధికారాలు ఇచ్చింది. అయితే ఢిల్లీ ప్రభుత్వానికి ఆ శక్తి దక్కకుండా ఉండేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఈ ఆర్డినెన్స్ అన్ని పవర్స్ ఇస్తుంది. సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది. దాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం” అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
రాజ్యసభలో ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఈనెల 24న శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, 25న ఎన్‍సీపీ అధినేత శరద్ పవార్‌ను ముంబైలో కేజ్రీవాల్ కలవనున్నారు.
అధికారుల బదిలీలు, నియామకాల నియంత్రణ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో కాకుండా తమకే ఉండాలని కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారుల సర్వీస్ నియంత్రణ అధికారం ఢిల్లీ ప్రభుత్వానికే ఉండాలంటూ సుప్రీం కోర్టు తీర్పుచెప్పింది. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్‌కే మళ్లీ అధికారాలు దక్కేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందిస్తోంది. ఈ ఆర్డినెన్స్‌పై కూడా సుప్రీంను ఆమ్ఆద్మీ ఆశ్రయించింది.