తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Bandh 2024: ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్; రైతు సంఘాల పిలుపు

Bharat Bandh 2024: ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్; రైతు సంఘాల పిలుపు

HT Telugu Desk HT Telugu

13 February 2024, 22:20 IST

google News
  • Bharat Bandh 2024: దేశవ్యాప్తంగా రైతన్నలు మరోసారి ఉద్యమ బాట పట్టారు. పింఛన్లు, పంటలకు కనీస మద్ధతు ధర, కార్మిక చట్ట సవరణలను ఉపసంహరణ.. తదితర డిమాండ్లతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు. అలాగే, ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ చేపడ్తున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. 

ట్రాక్టర్లపై ఢిల్లీకి భారీగా తరలివస్తున్న రైతులు
ట్రాక్టర్లపై ఢిల్లీకి భారీగా తరలివస్తున్న రైతులు (PTI)

ట్రాక్టర్లపై ఢిల్లీకి భారీగా తరలివస్తున్న రైతులు

Grameen Bharat Bandh 2024: మంగళవారం చేపట్టిన ‘ఢిల్లీ చలో’ విజయవంతమైంది. రైతులు వేలాదిగా దేశ రాజధాని ఢిల్లీకి తరలివచ్చారు. రైతుల చలో ఢిల్లీ కారణంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. పలు చోట్ల రైతులు, భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) అన్ని భావసారూప్య రైతు సంఘాలను ఏకం చేసి ఫిబ్రవరి 16 న గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

దేశవ్యాప్త సమ్మె

ఫిబ్రవరి 16న దేశ వ్యాప్త గ్రామీణ బంద్ (Grameen Bharat Bandh) నకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ బంద్ పిలుపునకు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్ధతునిచ్చాయి. ఈ నెల 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. భారత్ బంద్ తో పాటు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు భారీగా ‘చక్కా జామ్’ లలో పాల్గొంటారు. పంజాబ్ లో శుక్రవారం నాలుగు గంటల పాటు రాష్ట్ర, జాతీయ రహదారులను మూసివేయనున్నారు.

భారత్ బంద్ డిమాండ్లు ఏమిటి?

రైతులు ప్రధానంగా ఈ కింది డిమాండ్లతో భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ‘‘రైతులకు పింఛన్లు అందించాలి. పంటలకు సరైన కనీస మద్ధతు ధర ప్రకటించాలి. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించుకోవాలి’’ అనే ప్రధాన డిమాండ్లతో రైతులు ప్రస్తుతం ఉద్యమ బాట పట్టారు. వీటితో పాటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, శ్రామిక శక్తిని కాంట్రాక్ట్ చేయవద్దని, ఉపాధికి హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భారత్ బంద్ ప్రభావం

గ్రామీణ భారత్ బంద్ కారణంగా గ్రామాల్లో రవాణా, వ్యవసాయ కార్యకలాపాలు, ఉపాధి హామీ గ్రామీణ పనులు, ప్రైవేట్ కార్యాలయాలు, గ్రామాల్లోని దుకాణాలు, గ్రామీణ పారిశ్రామిక, సేవా రంగ సంస్థలు ఫిబ్రవరి 16న మూతపడనున్నాయి. ‘‘ ఫిబ్రవరి 16న అన్ని వ్యవసాయ కార్యకలాపాలు, ఉపాధిహామీ, గ్రామీణ పనులను నిలిపివేయాలని రైతు సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఆ రోజు ఏ రైతు, వ్యవసాయ కార్మికుడు లేదా గ్రామీణ కార్మికుడు పని చేయరు" అని ఎస్కెఎం జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ దర్శన్ పాల్ తెలిపారు. అంబులెన్స్ లు, వార్తాపత్రికల పంపిణీ, వివాహం, మెడికల్ షాపులు, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు వంటి అత్యవసర సేవలను సమ్మె సమయంలో నిలిపివేయబోమని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం