Bengaluru rains: బెంగళూరును ముంచెత్తిన వాన; 14 విమానాల డైవర్షన్
08 January 2024, 19:05 IST
- కర్నాటక రాజధాని బెంగళూరును మంగళవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. 14 విమానాలను వేరే నగరాలకు డైవర్ట్ చేశారు.
ప్రతీకాత్మక చిత్రం
Bengaluru rains: బెంగళూరును వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన కుంభ వృష్టితో నగర జనులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. గంటల కొలది ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
Bengaluru rains: ఉరుములు, పిడుగులు..
మంగళవారం సాయంత్రం బెంగళూరులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ముఖ్యంగా నగర శివార్లను వాన ముంచెత్తింది. మరో రెండు రోజుల పాటు ఇలా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ లో ల్యాండ్ కావాల్సిన 14 విమానాలను ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూరు విమానాశ్రయాలకు డైవర్ట్ చేశారు. 12 విమానాలను చెన్నై విమానాశ్రయానికి, ఒక్కో విమానాన్ని కోయంబత్తూరు, హైదరాబాద్ ఏర్ పోర్ట్ లకు పంపించారు. డైవర్ట్ చేసిన 14 విమానాల్లో 7 ఇండిగో విమానాలని, మూడు విస్తారా, రెండు ఆకాశ ఎయిర్ లైన్స్, ఒక్కోటి చొప్పున ఎయిర్ ఇండియా, గో ఎయిర్ విమానాలని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. డైవర్ట్ చేసిన విమానాలు ఆయా విమానాశ్రయాల్లో దిగి ఇంధనం నింపుకుని మళ్లీ బెంగళూరుకు వస్తాయని వెల్లడించారు.
Bengaluru rains: మరో రెండు రోజులు..
మరో రెండు రోజులు ఇలాగే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరుతో పాటు చామరాజనగర్, కొలార్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని దావనహళ్లి ప్రాంతంలో 45.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. దాంతో, ఆ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమైంది.