Bengaluru traffic: ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ జామ్ తో బెంగళూరు నగరవాసుల ఇక్కట్లు
28 September 2023, 11:02 IST
Bengaluru traffic: ఐటీ క్యాపిటల్ గా, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా పేరు గాంచిన బెంగళూరు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లకు పేరుగాంచింది. ముఖ్యంగా ఇప్పుడు భారీ వర్షాలకు తోడు గణేశ్ నిమజ్జనం కూడా రావడంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ లు సర్వ సాధారణమయ్యాయి.
బెంగళూరులోని ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు
Bengaluru traffic: బెంగళూరులోని ఐటీ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల కాలంలో తరచుగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. కేవలం రెండు కిమీల దూరానికి రెండు గంటల సమయం పట్టిందని వాహనదారులు వాపోతున్నారు.
రెండో స్థానంలో..
బెంగళూరు మరో రికార్డు కూడా సాధించింది. ప్రపంచంలో అత్యంత నిదానంగా ట్రాఫిక్ సాగే నగరాల్లో బెంగళూరుకు రెండో స్థానం దక్కింది. బుధవారం సాయంత్రం నగరంలోని ఐటీ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్డు లో ట్రాఫిక్ కొన్ని గంటల పాటు దాదాపు నిలిచిపోయింది. భారీ వర్షం, గణేశ్ నిమజ్జనంలతో పాటు ప్రముఖ కమేడియన్ ట్రేవర్ నోహ్ షో ఉండడంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బెంగళూరు ఐటీ కారిడార్ ఔటర్ రింగ్ రోడ్డులో మారతల్లి నుంచి సర్జాపూర్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఊహించని స్థాయిలో వాహనాలు రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని డీసీపీ ట్రాఫిక్ కుల్దీప్ కుమార్ జైన్ ట్వీట్ చేశారు.
లేట్ గా బయల్దేరండి..
బెంగళూరు ట్రాఫిక్ పై రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇచ్చే మహదేవ్ పురా టాస్క్ ఫోర్స్ కూడా ఓఆర్ఆర్ వైపు రావద్దని వాహనదారులకు సూచించింది. అలాగే, ఈ ప్రాంతంలో ఆఫీస్ ల్లో పని చేస్తున్న వారు తమ ఇళ్లకు వెళ్లడానికి రాత్రి 8 దాటిన తరువాత కార్యాలయాల నుంచి బయటకు రావాలని సూచించింది. మరో వైపు వాహనదారులు కూడా తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంటి నుంచి 4 కిమీల దూరంలోని ఆఫీస్ కు వెళ్లడానికి దాదాపు రెండున్నర గంటలు పట్టిందని ఒక ఉద్యోగి వాపోయాడు. పాదచారులు నడిచే పేవ్ మెంట్లను కూడా ద్విచక్ర వాహనాలు ఆక్రమించుకున్నాయని మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.