Ayodhya Ram Lalla new name: అయోధ్య రామ్ లల్లా ను ఇక ఈ పేరుతోనే పిలుస్తారు…
23 January 2024, 17:07 IST
Ayodhya Ram Lalla new name: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో జనవరి 22, సోమవారం అంగరంగ వైభవంగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సాధు సంతులు, ప్రముఖులు పాల్గొన్నారు.
అయోధ్య రామమందిరంలో కొలువుతీరిన బాలక్ రామ్
Ayodhya Ram Lalla new name: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ప్రతిష్టించినది రామ్ లల్లా విగ్రహం. అంటే, ఐదేళ్ల బాల రాముడి విగ్రహం. ఈ విగ్రహం 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగి రాజ్ అనే శిల్పి చెక్కారు.
బాలక రాముడు..
అయోధ్య (ayodhya) లోని రామాలయంలో జనవరి22న కొత్తగా ప్రతిష్ఠించిన రామ్ లల్లా విగ్రహాన్ని ఇకపై "బాలక్ రామ్ (“Balak Ram”)" అని పిలుస్తారని సోమవారం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ఒక పూజారి తెలిపారు. ఇది ఐదేళ్ల బాల రాముడి విగ్రహం కనుక, ఇకపై అయోధ్యలో కొలువైన ఈ రాముడు ’బాలక్ రామ్’గా పూజలను అందుకుంటారని పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు.
300 కోట్ల ఏళ్ల నాటి శిల
ఈ బాలక్ రామ్ విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ 51 అంగుళాల విగ్రహాన్ని మూడు బిలియన్ ఏళ్ల నాటి రాతిపై చెక్కారు. ఈ శిల్పానికి ఉపయోగించిన నీలిరంగు కృష్ణ శిల (నలుపు రంగు) ను మైసూరు సమీపంలోని హెచ్ డీ కోట తాలూకా, జయపుర హుబ్లీలోని గుజ్జెగౌడనపుర వద్ద ఉన్న పర్వతం నుంచి వెలికితీశారు. మృదువైన ఉపరితల లక్షణం కారణంగా దీనిని సాధారణంగా సోప్ స్టోన్ (soap stone) అని కూడా పిలుస్తారు. ఈ శిల విగ్రహాలను చెక్కడానికి శిల్పులకు అనువుగా ఉంటుంది.
బాలక్ రామ్ ను ఇలా అలంకరిస్తారు..
అయోధ్యలోని కొత్త రామాలయంలో కొలువుతీరిన ఈ బాలక్ రామ్ ను బనారసి వస్త్రంతో, పసుపు రంగు ధోతీ, ఎరుపు 'పటాకా' లేదా 'అంగవస్త్రం' ధరింపజేసి అలంకరిస్తారు. స్వచ్ఛమైన బంగారు 'జరీ', దారాలతో రూపొందించిన 'అంగవస్త్రం'పై , 'శంఖం', 'పద్మ', 'చక్రం', 'మయూర్' వంటి పవిత్ర వైష్ణవ చిహ్నాలను ప్రదర్శిస్తారు.
మూడు నమూనాల్లో..
ఆలయం కోసం రామ లల్లా విగ్రహాలను ముగ్గురు శిల్పులు రూపొందించారు. వారు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ్ పాండే. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. అయితే, మిగతా రెండు విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టిస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది.
పోటెత్తిన భక్తులు..
అయోధ్యలోని రామ మందిరానికి మంగళవారం తలుపులు తెరుచుకోవడంతో భక్తులు పోటెత్తారు. స్థానికులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో పాటు భక్తులు సోమవారం రాత్రి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయ ద్వారం వద్ద గుమిగూడారు. భక్తి మార్గం, రామ మందిరానికి దారితీసే రామ మార్గం వెంబడి రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఏర్పడింది. మంగళవారం తెల్లవారు జాము సమయానికే, కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది.